Share News

దండన నుంచి విముక్తి

ABN , Publish Date - May 12 , 2026 | 02:15 AM

సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని సీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యుడికి ప్రభుత్వం నుంచి భారీ నజరానా దక్కిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ళ క్రితం పీలేరు ఏరియా ఆసుపత్రిలో పనిచేసే సమయంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ పి.రవికుమార్‌ సుదీర్ఘకాలంపాటు విధులకు గైర్హాజరయ్యారు.

దండన నుంచి విముక్తి

నారావారిపల్లె వైద్యుడిని కనికరించిన ప్రభుత్వం

కలికిరి, మే 11 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని సీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యుడికి ప్రభుత్వం నుంచి భారీ నజరానా దక్కిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ళ క్రితం పీలేరు ఏరియా ఆసుపత్రిలో పనిచేసే సమయంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ పి.రవికుమార్‌ సుదీర్ఘకాలంపాటు విధులకు గైర్హాజరయ్యారు. 2021 ఆగస్టు 5 నుంచి 2022 జనవరి 31 వరకూ ఒక పర్యాయం, 2024 జనవరి 30 నుంచి మార్చి 17 వరకూ మరో పర్యాయం రెండు విడతలుగా మొత్తం ఐదున్నర నెలల కాలం విధులకు రాలేదు. విచారణ అనంతరం ఆయన తప్పిదాలకు దండనగా క్యుములేటివ్‌ ప్రభావంతో రెండు ఇంక్రిమెంట్లు కోత విధించడంతోపాటు గైర్హాజరు కాలాన్ని డైస్‌-నన్‌ (గైర్హాజరు కాలానికి జీతం కూడా ఇవ్వకుండా సర్వీసులో లేనట్లుగా పరిగణించడం)గా నిర్ధారిస్తూ 2026 జనవరి 19 తాడేపల్లె డీఎ్‌సహెచ్‌ (డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌) ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాకుండా ఆయన్ను పీలేరు ఏరియా ఆసుపత్రి నుంచి నారావారిపల్లె సీహెచ్‌సీకి బదిలీ చేశారు. తనకు విధించిన దండనను పునఃపరిశీలించాలని రవికుమార్‌ ప్రభుత్వానికి అప్పీలు చేసుకున్నారు. ఆ మేరకు డీఎ్‌సహెచ్‌ కూడా ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం రెండు ఇంక్రిమెంట్లకు బదులుగా ఒక ఇంక్రిమెంటుకు.. అదీ క్యుములేటివ్‌ ప్రభావం లేకుండా కుదించి కోత విధించాలని, గైర్హాజరు కాలాన్ని అసాధారణమైన సెలవుగా పరిగణించారు. అయితే ఇలాంటివి తిరిగి భవిషత్తులో పునరావృతం కారాదని హెచ్చరికతో వదిలేసింది. దీంతో రవికుమార్‌కు ఊరట లభించినట్లయ్యింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - May 12 , 2026 | 02:15 AM