Share News

యథేచ్ఛగా గ్రానైట్‌ రవాణా

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:23 AM

రాత్రింబవళ్లు రయ్‌ రయ్‌మంటూ గ్రానైట్‌ లారీలు పరుగులు పెడుతున్నాయి. ఒకట్రెండు రాయల్టీ కట్టి అధికారికంగా వెళితే.. అంతకుమించి దిమ్మెలు కనిపించకుండా కవర్లు కప్పి అక్రమంగా తరలిస్తున్నారు.

యథేచ్ఛగా గ్రానైట్‌ రవాణా
పలమనేరు మీదుగా తమిళనాడుకు గ్రానైట్‌ దిమ్మెలు తీసుకెళుతున్న లారీలు

రాత్రింబవళ్లు రయ్‌ రయ్‌మంటూ గ్రానైట్‌ లారీలు పరుగులు పెడుతున్నాయి. ఒకట్రెండు రాయల్టీ కట్టి అధికారికంగా వెళితే.. అంతకుమించి దిమ్మెలు కనిపించకుండా కవర్లు కప్పి అక్రమంగా తరలిస్తున్నారు. పలమనేరు మీదుగా రోజూ పదుల సంఖ్యలో ఇలా అధిక సామర్థ్యంతో గ్రానైట్‌ దిమ్మెలు తరలిస్తున్నా పట్టించుకునే వారే లేరు.

- పలమనేరు, ఆంధ్రజ్యోతి

పలమనేరు మీదుగా ప్రతినిత్యం గ్రానైట్‌ దిమ్మెలను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. మన జిల్లాలోని క్వారీలనుంచే కాకుండా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలనుంచీ రవాణా అవుతోందని తెలిసింది. స్థానిక మార్కెట్‌ కంటే విదేశీ మార్కెట్‌లో ఇక్కడి గ్రానైట్‌కు మంచి గిరాకీ ఉంది. దీంతో అధికారికంగా కొన్ని.. అనధికారికంగా అధికంగా తరలిస్తున్నారు. వాస్తవానికి క్వారీల నుంచి వెలికి తీసి రవాణాకు సిద్ధం చేసిన గ్రానైట్‌ దిమ్మెల కొలతలు తీసి, రాయల్టీ కట్టాకే రవాణా చేయాలి. అయితే ఇదంతా చట్టప్రకారం జరిగినప్పుడు మాత్రమే. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఏమాత్రం తనిఖీలు లేకుండానే అధికారుల నుంచి వే బిల్లులు తీసుకొని అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తొలుత చెన్నె హార్బర్‌కు.. అక్కడ్నుంచి విదేశాలకు గ్రానైట్‌ పంపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. స్థానిక మార్కెట్‌తో పోలిస్తే.. విదేశాలకు పంపడం ద్వారా మూడు నాలుగు రెట్లు డబ్బు ఎక్కువగా లభిస్తున్నట్లు సమాచారం. అందుకే అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ.. అధికారులు తమ జోలికి రాకుండా నిరాటంకంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఏ ప్రభుత్వమున్నా వీరికి అడ్డు లేకపోవడం గమనార్హం.

అక్రమ రవాణా కాబట్టే..

సాధారణంగా లారీలలో ఏ సరుకు తరలించినా వర్షానికి, ఎండకు దెబ్బతినకుండా రక్షణ చర్యగా తార్‌పాల్‌తో కడతారు. క్వారీలో రవాణాకు సిద్ధం చేసిన గ్రానైట్‌ దిమ్మెలపై గనులశాఖ అధికారులు వాటి వివరాలు స్పష్టంగా నమోదు చేస్తారు. అందువల్లే గ్రానైట్‌ దిమ్మలు అధికారికమైతే వాటికి ఎటువంటి తార్‌పాల్‌ కప్పరు. ఇవి ఎండకో.. వానకో దెబ్బతినవు. కానీ, అక్రమంగా రవాణా చేస్తుండటంతో లారీల్లో గ్రానైట్‌ దిమ్మెలు పైకి కనిపించకుండా ప్లాస్టిక్‌ సంచులతో తయారు చేసిన తార్‌పాల్‌ను కప్పుతున్నారు.

పరిమితికి మించి...

నిబంధనల మేరకు వాహనాన్ని బట్టి.. సరుకు రవాణా చేసేందుకు ఒక పరిమితి ఉంటుంది. లారీలకు 10 టన్నులనుంచి 40 టన్నుల వరకూ వేయొచ్చు. అయితే, పెరిగిన డీజిల్‌ ధరలు, డ్రైవర్ల జీతాల కారణంగా ఈ గ్రానైట్‌ అక్రమ రవాణాలో వాహనాల పరిమితికి మించి లోడ్‌ చేస్తున్నారు. ఉదాహరణకు 40 టన్నులే తీసుకు వెళ్లాల్సిన కంటైనర్లలో దాదాపు 60 టన్నులు వేస్తున్నారు. దీనివల్ల అంతర్రాష్ట్ర రోడ్లు ఛిద్రమైపోతున్నాయి. ఇక, పలమనేరు నుంచి తమిళనాడుకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి తిరుమల ఘాట్‌రోడ్డులా ఉంటుంది. ఈ రహదారిలో ఇలా పరిమితికి మించిన లోడ్‌తో ప్రయాణం సాగడం ప్రమాదకరం.

ప్రభుత్వాదాయానికి గండి

గ్రానైట్‌ అక్రమ రవాణాతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. క్వారీలనుంచి వెలికి తీసిన ప్రతి గ్రానైట్‌ దిమ్మెకు ప్రభుత్వానికి నిర్ణీత మొత్తాన్ని రాయల్టీ రూపంలో చెల్లించాలి. అయితే, క్వారీల్లో వెలికి తీస్తున్న గ్రానైట్‌ దిమ్మెల్లో సగానికిపైగా అక్రమ రవాణా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ దిమ్మెలకు సంబంధించి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించనందున ఆ మేరకు రాబడి పోయినట్లే.

Updated Date - Feb 13 , 2026 | 12:23 AM