21వేల మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ కరెంట్
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:38 AM
చిత్తూరు జిల్లాలో సూర్యఘర్ పథకం ద్వారా 21వేల మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మే నెలలోపు ఉచితంగా సోలార్ విద్యుత్ ఇవ్వనున్నట్లు చిత్తూరు ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్. ఇస్మాయిల్ అహ్మద్ చెప్పారు.
పుంగనూరు, జనవరి28(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో సూర్యఘర్ పథకం ద్వారా 21వేల మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మే నెలలోపు ఉచితంగా సోలార్ విద్యుత్ ఇవ్వనున్నట్లు చిత్తూరు ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్. ఇస్మాయిల్ అహ్మద్ చెప్పారు. బుధవారం పుంగనూరు ఏపీఎస్పీడీసీఎల్ డీఈ కార్యాలయం, మండలంలోని వనమలదిన్నె, ఏటవాకిలి, కోటగడ్డ, చండ్రమాకులపల్లె విద్యుత్ సబ్‌స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుంగనూరులో ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ చార్జీలు భారం కాకుండా సూర్యఘర్ ద్వారా సోలార్ కరెంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. వారికి మిగిలిన కరెంట్‌ను ఏపీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేస్తుందని, ఆ పనులను మే నెలలోపు పూర్తి చేస్తారని అన్నారు. పుంగనూరు డివిజన్‌తో కలిపి ఆర్డీఎస్ పనులు వేగంగా జరుగుతున్నాయని, 421 ఫీడర్లలో పనులు జరుగుతుండగా 192 ఫీడర్లలో పూర్తయ్యాయని వివరించారు. లోఓల్టేజీ సమస్య లేకుండా జిల్లాలో 12 నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు కాగా కుప్పంలో 3, పలమనేరు, పుంగనూరులో ఒక్కొక్కటి చొప్పున నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో రెండు త్వరలో పూర్తి అవుతాయని, మిగిలిన 5 సబ్‌స్టేషన్లు పనులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో కరెంట్ వినియోగదారుల నుంచి ప్రతినెలా రూ.25 కోట్లు విద్యుత్ బిల్లుల వసూలు లక్ష్యంగా పెట్టుకుని పూర్తి చేస్తున్నామన్నారు. కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని తెలిపారు. రిపబ్లిక్ డేలో జిల్లా ఉత్తమ సర్కిల్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన వెంట పుంగనూరు డీఈఈ శ్రీనివాసమూర్తి, ఏడీఈ పి.శ్రీనివాసులు ఉన్నారు.