ఉచితంగా ఆధార్ నవీకరణ
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:41 AM
విద్యార్థుల ఆధార్ నవీకరణకు మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా రెండు విడతల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో ఎనిమిది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌గా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆధార్ నవీకరణకు మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా రెండు విడతల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో ఎనిమిది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌గా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తొలి విడతగా మంగళవారం నుంచి 17వ తేదీ వరకు.. రెండో విడత కింద 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ఈ శిబిరాల్లో ఉచితంగా ఆధార్ నమోదుతోపాటు బయోమెట్రిక్ అప్‌డేట్ (ఎంబీయూ-1, ఎంబీయూ-2) చేస్తారు. 5-7, 15-17 ఏళ్ల మధ్య వయసుండి.. ఇప్పటికీ ఆధార్ నవీకరణ చేయించుకోనివారు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి విద్యార్థులను గ్రామాలవారీగా గుర్తించి సమాచారం అందించారు. అధికసంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఈ శిబిరాల్లో నవీకరణతో పాటు చిన్నారులకు ఆధార్ నమోదు సేవలను ఉచితంగా అందిస్తారు.
ఈ పత్రాలు అవసరం
ప్రస్తుత ఆధార్‌కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. కొత్తగా నమోదు చేయించుకోవాలంటే పుట్టిన తేదీ ధ్రువపత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు తీసుకెళ్లాలి. మార్పులు, చేర్పులకు పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి మార్కుల జాబితా, చిరునామా ధ్రువపత్రాలు ఉండాలి.
- రవికుమార్, డీఎల్డీవో, చిత్తూరు.