Share News

నకిలీ పాస్‌బుక్‌తో మోసం

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:47 AM

లేని భూమికి నకిలీ పాస్‌బుక్‌ తయారు చేయించి మోసం చేశారని ఓ మహిళ బుధవారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నకిలీ పాస్‌బుక్‌తో మోసం
నకిలీ పాస్‌బుక్‌ చూపుతున్న బాధితురాలు శోభారాణి

- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

మదనపల్లె క్రైం, జూలై 29(ఆంధ్రజ్యోతి): లేని భూమికి నకిలీ పాస్‌బుక్‌ తయారు చేయించి మోసం చేశారని ఓ మహిళ బుధవారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు..మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ డ్రైవర్స్‌కాలనీకి చెందిన పి.శోభారాణి, పి.పుల్లారెడ్డి దంపతులు ఏడాదిన్నర కిందట మండలంలోని గంగన్నగారిపల్లెకు చెందిన సోదరులు పెద్దన్న, మణి, మురళి, వారి దాయాది రెడ్డెప్పలకు చెందిన 2.52ఎకరాల భూమిని రూ.13లక్షలకు కొనుగోలు చేశారు. మధ్యవర్తి మొలకలదిన్నెకు చెందిన శేఖర్‌ రూ.లక్ష తీసుకుని ఫోర్జరీ సంతకాలతో పుల్లారెడ్డి పేరుమీద నకిలీ పాస్‌బుక్‌ తయారీ చేయించి ఇచ్చాడు. అందులో పట్టానంబర్‌, విస్తీర్ణం వివరాలు లేకపోగా 2007లో అప్పటి తహసీల్దార్‌ పాస్‌బుక్‌ జారీ చేసినట్లు ఫోర్జరీ సంతకాలు, నకిలీ సీళ్లతో మోసానికి పాల్పడ్డాడు. అయితే ఆన్‌లైన్‌లో పరిశీలించగా వారు విక్రయించిన భూమి కేవలం ఏడు సెంట్లు మాత్రమే అని తేలింది. కానీ పాస్‌బుక్‌లో మాత్రం 2.52ఎకరాలు ఉన్నట్లు సృష్టించారు. మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బుధవారం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారిస్తున్నట్లు సీఐ కళావెంకటరమణ చెప్పారు.

Updated Date - Jul 30 , 2026 | 12:47 AM