తమిళ జాలర్ల నియంత్రణకు నాలుగు గస్తీ బోట్లు
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:24 AM
మత్స్యకారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.
తిరుపతి(కలెక్టరేట్), ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు మత్స్యకారులతో సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పక్క రాష్ట్రాల మత్స్యకారులతో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.గస్తీ కోసం నాలుగుబోట్లను మంజూరు చేయగా రెండు బోట్లు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో గస్తీ వుండేలా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఇతరరాష్ట్రాల నుంచి మన జలాల్లోకి వచ్చే జాలర్లను నియంత్రించడానికి 24 గంటలూ గస్తీ చేపట్టామన్నారు. మెరైన్ పోలీసులకు రూ.25లక్షలు కూడా మంజూరు చేశామన్నారు. కొత్త బోట్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. జువ్వలదిన్నె ప్రాంతంలో చిన్న జెట్టి ఏర్పాటు చేస్తామన్నారు.ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల భద్రత కోసం గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 800హెచ్‌పీ సామర్థ్యం కలిగిన స్టీల్ బోట్లను గస్తీ విభాగంలోకి తీసుకువస్తామన్నారు. మెరైన్ పోలీసు విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబా, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, సూళ్ళూరుపేట ఆర్డీవో దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.