ఆరేళ్ళలో నలుగురు ఈవోల బదిలీ
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:44 AM
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థ టీటీడీలో రెగ్యులర్ ఈవోలు కుదురుగా కొనసాగలేకపోతున్నారు. ముఖ్యంగా 2019 తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. కేవలం ఆరేళ్ళ వ్యవధిలో నలుగురు రెగ్యులర్ ఈవోలు మారారు.
తిరుపతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధార్మిక సంస్థ టీటీడీలో రెగ్యులర్ ఈవోలు కుదురుగా కొనసాగలేకపోతున్నారు. ముఖ్యంగా 2019 తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. కేవలం ఆరేళ్ళ వ్యవధిలో నలుగురు రెగ్యులర్ ఈవోలు మారారు. ఒక్కొక్కరు రెండేళ్ళు పనిచేశారనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆ ఆరేళ్ళలో రెండేళ్ళు ఎఫ్‌ఏసీ అధికారి ఈవోగా వున్నారు. అంటే నాలుగేళ్ళలో నలుగురు ఈవోలు వచ్చి వెళ్ళిపోయారు. ఆ క్రమంలో తాజాగా నాలుగు నెలలకే అనిల్ కుమార్ సింఘాల్ అర్ధాంతరంగా బదిలీ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వంలో మొదలైన అస్థిరత
గత వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకూ టీటీడీలో స్థిరమైన పాలన కొనసాగేది. ప్రభుత్వం ఎవరిని ఈవోగా నియమించినా కనీసం రెండేళ్ళకు పైబడి పనిచేసేవారు. సగటున మూడేళ్ళ పాటు పనిచేసిన వారే ఎక్కువ. రాజకీయ జోక్యం పెద్దగా వుండేది కాదు.2019 తర్వాత పరిస్థితులు మారాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడంతో టీటీడీలో రాజకీయ జోక్యం మితిమీరింది. 2017 మేలో ఈవోగా వచ్చిన అనిల్ కుమార్ సింఘాల్ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా 17 నెలల పాటు పనిచేయడం ఒక విధంగా రికార్డనే చెప్పాలి. ఆయన 2020 అక్టోబరులో బదిలీ అయ్యారు. వారం పాటు ఇంఛార్జి ఈవోగా ధర్మారెడ్డి పనిచేయగా తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి ఈవోగా వచ్చారు. ఆయన కూడా 18 నెలలకు మించి కొనసాగలేకపోయారు. ఆ కాలంలోనైనా ఆయన పూర్తిస్థాయిలో ఇక్కడ పనిచేసింది లేదు. సీఎం కార్యాలయంలో, వైద్యారోగ్య శాఖలోనూ అదనపు బాధ్యతల కారణంగా టీటీడీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. ఆయన 2022 మేలో బదిలీ అయ్యారు. తర్వాత రెండేళ్ళ పాటు టీటీడీకి రెగ్యులర్ ఈవో లేకుండా పోయారు. తిరుమల అదనపు ఈవోగా వుండిన ధర్మారెడ్డే 2022 మే నుంచీ 2024 జూన్ వరకూ ఎఫ్‌ఏసీగా ఈవో పోస్టులో కొనసాగారు. వైసీపీ ప్రభుత్వం కొనసాగిన ఐదేళ్ళ పాటూ టీటీడీలో ఈ విధమైన అస్థిరత కొనసాగింది.2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో టీటీడీలో క్రమబద్ధమైన, స్థిరమైన పరిపాలన మొదలవుతుందని అంతా భావించారు. అయితే తర్వాత కూడా పరిస్థితిలో మార్పేమీ కనిపించడం లేదు. 2024 జూన్ 16న ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు పాలకమండలితో సయోధ్య లేక 14 నెలలకే టీటీడీని వీడాల్సి వచ్చింది. 2025 సెప్టెంబరులో ఆయన అర్థాంతరంగా బదిలీ అయ్యారు. ఆ పోస్టులో అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. వివాదాలకు దూరంగా వుంటారని పేరున్న ఆయన కూడా ఐదు నెలలు సైతం పూర్తి కాకముందే టీటీడీ నుంచీ నిష్క్రమించాల్సి వచ్చింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో తొలుత 2019లో టెండరు నిబంధనలను బలోపేతం చేసిన ఆయనే మరుసటి ఏడాది అవే నిబంధనలను సడలించిన సమయంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం ప్రస్తుత బదిలీకి కారణమైంది. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో ఈవో తన బాధ్యతల మేరకు వ్యవహరించలేదన్న అంశాన్ని గుర్తించిన సిట్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో ఆయన బదిలీ అనివార్యమైంది. ఆయన స్థానంలో ఈవోగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ ఽఅధికారి ముద్దాడ రవిచంద్ర కూడా రెగ్యులర్ ఈవోగా కాకుండా ఎఫ్‌ఏసీ ఈవోగా నియమితులు కావడం ఈ సందర్భంగా గమనార్హం. దీన్ని బట్టి చూస్తే మరికొంత కాలం టీటీడీకి రెగ్యులర్ ఈవో వుండరన్నది స్పష్టమవుతోంది.