బెల్ట్ మురళి హత్య కేసు సాక్షి కిడ్నాప్ కేసులో నలుగురి అరెస్ట్
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:59 AM
బెల్ట్ మురళి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న మల్లారపు చిన్నను తిరుపతి కోర్టు ప్రాంగణం బయట నుంచి కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులను తిరుపతి వెస్ట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): బెల్ట్ మురళి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న మల్లారపు చిన్నను తిరుపతి కోర్టు ప్రాంగణం బయట నుంచి కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులను తిరుపతి వెస్ట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బెల్ట్ మురళి హత్య కేసు విచారణ నిమిత్తం ఈనెల 5వ తేదీన మల్లారపు చిన్న తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ మరునాటికి వాయిదాపడటంతో చిన్నా కోర్టు నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. కోర్టు బయట ప్రాంగణం వెలుపల కొందరు నిందితులు అతడిని బైక్‌పై బలవంతంగా ఎక్కించుకుని ఎస్వీ మెడికల్ కళాశాల ప్రాంతంతో ఓ లాడ్జికి, అక్కడి నుంచి మేర్లపాక టోల్‌గేట్ సమీపంలోని మరో లాడ్జికి తీసుకెళ్లారు. హత్య కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని లేదంటే అతని కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత ఆయన్ను వెస్ట్ పోలీసు స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్ పోలీసులు ఐదో తేదీన కేసు నమోదు చేశారు. అప్పటినుంచి నిందితులు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో నిందితులైన పసుపులేటి రవి, శ్రీనురెడ్డి, వేణుగోపాల్, ఆదిత్యవర్మను వెస్ట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వీరిని కోర్టుకు హాజరుపరచనున్నట్టు సీఐ రామకృష్ణ చెప్పారు. మరో నలుగురు నిందితులైన పసుపులేటి సురేష్, పవన్, విశ్వనాయక్, చంద్ర పరారీలో ఉన్నారని.. వారికోసం గాలిస్తున్నామన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు.