Share News

హార్టికల్చర్‌ హాబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:16 AM

మూడేళ్లు.. మూడు దశలు.. రాయలసీమ ఉద్యాన సీమగా మారనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.లక్ష కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు శుక్రవారం తొలి అడుగు పడింది.

 హార్టికల్చర్‌ హాబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన

మూడేళ్లు.. మూడు దశలు.. రాయలసీమ ఉద్యాన సీమగా మారనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.లక్ష కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు శుక్రవారం తొలి అడుగు పడింది. మదనపల్లె సమీపం బీకేపల్లె బైపా్‌సరోడ్డు సమీపంలో జరిగిన ఈ సమావేశానికి సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ, మంత్రి నారా లోకేశ్‌ ముఖ్య అతిథులుగా హారయ్యారు. సభా వేదికపై నుంచి ఉదయం 11.49 గంటలకు వర్చువల్‌ విధానంలో హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీంతో రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలోని ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ఈ సభకు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి 70వేల మందికిపైగా రైతులు, ప్రజలు హాజరయ్యారు. మూడుషెడ్లలోని గ్యాలరీలు నిండిపోగా, వేలాది మంది బయటే ఉన్నారు. కార్యక్రమం ప్రారంభమైనా వివిధ ప్రాంతాల నుంచి జనాలు వస్తూనే ఉన్నారు. మొత్తమ్మీద ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో సభ విజయవంతమైంది. సభా వేదికపై జాతిపిత మహాత్మాగాంధీ, లాల్‌ బహుదూర్‌శాస్త్రి విగ్రహాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌.. రాయలసీమ రైజింగ్‌ లఘుచిత్ర ఆడియో విజువల్స్‌ ప్రదర్శించారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు సంబంధించి ప్రభుత్వం, రిలయన్స్‌ మధ్య ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

ఒకే హెలికాప్టర్‌లో చంద్రబాబు, లోకేశ్‌

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఉదయం 10.20 గంటలకు ఒకే హెలికాప్టర్‌లో కలిసి మదనపల్లె మండలం కొండామర్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 10.30 గంటలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌... 10.50 గంటలకు రిలయన్స్‌ అధినేత అనంత్‌ అంబానీ వేర్వేరు హెలికాప్టర్లలో అక్కడికి వచ్చారు. 11.10 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చేరుకున్నారు. ఆమెకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర మంత్రి లోకేశ్‌, ఇతర మంత్రులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. 11.33 గంటలకు సభావేదికపైకి వచ్చారు.

ఆకర్షణీయంగా అలంకరణ

ఫల, పుష్ప ప్రదర్శనశాలను తలపించేలా సభా ప్రాంగణాన్ని అలంకరించారు. వివిధ జిల్లాల్లో సాగు చేసే ఉద్యాన పంటల ఉత్పత్తులతో ఏపీ మ్యాప్‌గా ఏర్పాటు చేశారు. రాయలసీమలో ఉద్యాన పంటల సాగును ప్రతిబింబించేలా పండ్లతో నింపిన ఎడ్ల బండిని ప్రదర్శనలో ఉంచారు. సభా ప్రాంగణంలోని వివిధ స్టాళ్లలో ఉద్యాన పంటల ఉత్పత్తులు, నీటి సంరక్షణ, నీటి నిర్వహణను తెలియజేసేలా నమూనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగిశాక కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌, అనంత్‌ అంబానీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. అనంతరం మొక్కలు నాటారు. రాయలసీమ జిల్లాల్లో పండుతున్న ఉద్యాన వన ఉత్పత్తులతో అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సుమారు 20 నిమిషాలు సందర్శించారు. మధ్యాహ్నం 2.03 గంటలకు సభాప్రాంగణం నుంచి బయలుదేరి కొండామర్రిలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 2.20 గంటలకు అక్కడ్నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

- అన్నమయ్య/మదనపల్లె, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 03 , 2026 | 01:16 AM