Share News

అటవీ సిబ్బంది ఏనుగులాట

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:36 AM

ఏనుగులను తరిమే విషయంలో అటవీశాఖ అధికారులు పరస్పరం పోటీపడటం సమన్యయ లోపాన్ని బయటపెడుతోంది.

అటవీ సిబ్బంది ఏనుగులాట
ఏనుగుల దాడిలో ధ్వంసమైన అరటిచెట్లు

పశ్చిమం వైపు తరుముతున్న తూర్పు విభాగ ఉద్యోగులు

వాటిని తూర్పు వైపు మళ్లిస్తున్న పశ్చిమ విభాగం వారు

పరస్పరం ఉద్యోగుల్లో లోపిస్తున్న సమన్వయం

కల్లూరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఏనుగులను తరిమే విషయంలో అటవీశాఖ అధికారులు పరస్పరం పోటీపడటం సమన్యయ లోపాన్ని బయటపెడుతోంది. వివరాలిలా.. వారం క్రితం తలకోన అడవి నుంచి వచ్చిన 12 ఏనుగులు సోమవారం పగలంతా పశ్చిమ విభాగ అటవీ ప్రాంతంలోని గోగులమ్మ వంక వద్ద తిష్ట వేశాయి. వీటి ఉనికి తెలుసుకున్న తూర్పు విభాగ అటవీ సిబ్బంది సాయంత్రం ఎస్సార్‌ పెట్రోల్‌ బంకు సమీపంలోని హైవే వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో పశ్చిమ విభాగ అటవీ ప్రాంతం నుంచి టపాకాయలు శబ్దాలు వినిపించాయి. దీంతో ఏనుగుల గుంపును తమవైపునకు పశ్చిమ విభాగ సిబ్బంది మళ్లిస్తున్నారని తూర్పు విభాగ సిబ్బంది గుర్తించారు. వారు కూడా హైవేపై టపాకాయలు పేల్చారు. ఈక్రమంలో పశ్చిమ విభాగ సిబ్బంది ఏనుగుల గుంపును వెంబడిస్తూ హైవే వద్దకు చేరుకున్నారు. రెండు విభాగాల సిబ్బంది అక్కడ ఎదురుపడ్డారు. ఏనుగులను హైవే వరకు ఎందుకు తరుముకొస్తున్నారంటూ తూర్పు విభాగం సిబ్బంది అడ్డుకున్నారు. ముందుకెళుతున్న గుంపును ఎందుకు అడ్డుకుంటున్నారని పశ్చిమ విభాగం సిబ్బంది వాగ్వాదానికి దిగారు. తమ పరిధిలోకి ఏనుగుల గుంపు రాకూడదంటూ వీరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఏనుగులను తరమడం కంటే ఒకరిపై ఒకరు నిందలేసుకోవడంలోనే వీరు పోటీ పడ్డారు. సోమవారం రాత్రంతా పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలోనే ఏనుగులు తిష్ట వేసినట్లు తెలుస్తోంది. వాటిని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తరుముతూ నాలుగేళ్లుగా ఇరు విభాగాల సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమన్వయంతో ఏనుగులను పొలాల్లోకి రాకుండా నిలువరించాల్సిన అటవీశాఖ సిబ్బంది ఇలా వాదులాడుకోవడాన్ని రైతులు ఆక్షేపిస్తున్నారు. కాగా ఏనుగులు మంగళంపేటలోని బుడ్డన్నగారిఇండ్ల వద్ద పంట పొలాల్లో అరటి, మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. కొబ్బరిచెట్లను నేలకూల్చాయి. డ్రిప్‌ పైపులు, గేటువాళ్లను విరిచేశాయి. రాత్రంతా పొలాల్లో బీభత్సం సృష్టించాయి.

Updated Date - Sep 09 , 2026 | 01:36 AM