Share News

అడవులు అగ్గిపాలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:55 AM

కాలిపోతున్న పచ్చనిచెట్లు, జీవరాశులు కనిపించని ఫైర్‌వాల్స్‌, వన సంరక్షకులు

అడవులు అగ్గిపాలు
అగ్నికి ఆహుతవుతున్న తంబళ్లపల్లె మల్లయ్యకొండ అడవి(ఫైల్‌ఫొటో)

మదనపల్లె టౌన్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): వేసవి వచ్చిందంటే చాలు అడవులకు నిప్పు అంటుకుంటోంది. ఆకతాయిల చేష్టలు, ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని వేల హెక్టార్ల అడవులు దగ్ధమవుతున్నాయి. పచ్చనిచెట్లతోపాటు వేలాది జీవరాశులు ఆహుతి అవుతున్నాయి. జిల్లాలో మదనపల్లె, పుంగనూరు, పీలేరు, రాయచోటి ఫారెస్ట్‌ రేంజిలు ఉన్నాయి. వీటిలో 3.33లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఎక్కువ భాగం మదనపల్లె, పీలేరు రేంజిలలో 2.78లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులో వేప, సండ్ర, పొడి ఆకులు రాల్చే చెట్లు, ముళ్ల పొదలు ఎక్కువగా ఉన్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, కృష్ణజింకలు, కణితులు, అడవి పందులు, నెమళ్లు, వేలాది పక్షి జాతులు, సరీసృపాలైన పాములు, తొండలు, కుందేళ్లు లాంటి వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వీటికితోడు ఆయుర్వేదం, హోమియోపతి వైద్య చికిత్సలకు అమూల్యమైన వనమూలికలు కూడా ఉన్నాయి.

అడవుల సంరక్షణకు ఫైర్‌వాల్స్‌

వేసవిలో అడవులు అగ్నికి అహుతి కాకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫైర్‌వాల్స్‌, డిజిటల్‌ ఫైర్‌వాల్స్‌, వనసంరక్షకులను ఏర్పాటు చేస్తారు. ఏటవాలు అడవుల్లో కొండల పై నుంచి కింది వరకు 30 మీటర్ల వెడల్పుతో కేవలం రాళ్లు మాత్రం ఉండేలా ఖాళీ స్థలం ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఒకవేళ అడవుల్లో మంటలు పుట్టినా విస్తరించకుండా ఈ ఫైర్‌వాల్స్‌ అడ్డుకుంటాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఫైర్‌వాల్స్‌ క్లీనింగ్‌, కొత్తవి ఏర్పాటు చేయడం ఆనవాయితీ. దీనికోసం రేంజిల విస్తీర్ణం బట్టి ప్రభుత్వం ఏటా రూ.30 నుంచి రూ.40 లక్షల నిధులు విడుదల చేస్తుంది. ఇందులో కాంపా నిధుల కింద కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరిస్తాయి. జిల్లాకు వన సంరక్షణ కింద ఏడాదికి రూ.కోటి దాకా నిధులు మంజూరు కావల్సి ఉంది. ఇందులో ఫైర్‌వాల్స్‌ ఏర్పాటు, క్లీనింగ్‌ చేసే కూలీలకు, వన సంరక్షకులకు నెల వేతనాలు, అడవుల్లో నీటి నిల్వల ఉండేలా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేయడం, ఫైర్‌ బ్లోయర్స్‌, పరికరాలు కొనుగోలుకు వినియోగించాల్సి ఉంది. కానీ ఈ నిధులు విడుదలయ్యాయో లేదో తెలియని దయనీయ పరిస్థితి అటవీశాఖలో నెలకొనివుంది.

డిజిటల్‌ ఫైర్‌ వాల్స్‌కు

సాంకేతికతను ఆధారం చేసుకుని డిజిటల్‌ ఫైర్‌వాల్స్‌/లైన్స్‌ ఏర్పాటు చేస్తారు. ఎఫ్‌ఎ్‌సఐ(ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) వివరాలతో అడవుల్లో ఎక్కడైనా నిప్పుపుట్టి పొగలు వస్తే శాటిలైట్‌ ద్వారా గుర్తించి ఆయా ఫారెస్ట్‌ రేంజర్ల మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌ వెళ్తుంది. వెంటనే ఎఫ్‌ఆర్‌వో కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి మంటలను అదుపులోకి తెస్తారు. దుర్బేధ్యమైన అడవుల్లో డ్రోన్ల సహాయంతో అడవుల్లో మంటలను గుర్తించి, పలు మార్గాల ద్వారా మంటలను ఆర్పుతారు. ఇటీవల నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌డీఎం) నుంచి ప్రజల మొబైల్‌ఫోన్లకు అప్రమత్త మెసేజ్‌లు వస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో అమలులో కష్టాలు

ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా అడవులు తగలబడిపోతున్నాయి. ఆకతాయిలు నిప్పుపెట్టడం, గొర్రెల కాపర్లు, కొత్త బోధ కోసం బోధగడ్డికి నిప్పుపెట్టడం వలన అడవులు దగ్ధమవుతున్నాయి. సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్లి ప్రజల సహకారంతో మంటలను ఆర్పడం అటవీశాఖ సిబ్బందికి కష్టమవుతోంది. గత ఏడాది ములకలచెరువు మండలంలో ఓ అడవిలో మేతకు వెళ్లిన 100 గొర్రెలు మంటలకు బలైపోయాయి. తాజాగా మదనపల్లె రేంజి పరిధిలోని నూరుకుప్పలకొండ, బొమ్మకొండ, బసినికొండ, తంబళ్లపల్లె మల్లయ్యకొండ అడవులకు నిప్పు అంటుకుని భారీ నష్టం వచ్చింది. వేల సంఖ్యలో వన్యప్రాణులు, సరీసృపాలు మరణించాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యి మంటలను ఆర్పడంలో సఫలీకృతులయ్యారు.

18 కిలోమీటర్ల ఫైర్‌వాల్స్‌ ఏర్పాటు చేశాం

మదనపల్లె రేంజిలోని అడవుల్లో అక్కడక్కడా ఫైర్‌వాల్స్‌ ఏర్పాటు చేశాం. మొత్తం 18 కిలోమీటర్ల పొడవునా ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేయడమే కాక, రెండు నెలలుగా క్లీనింగ్‌ చేయించాం. ప్రజలు కూడా అవగాహన పెంచుకుని అడవులకు నిప్పుపడకుండా సహకరించాలి.

జయప్రసాదరావు, ఫారెస్ట్‌ రేంజర్‌, మదనపల్లె

Updated Date - Feb 28 , 2026 | 01:55 AM