నాటి అపచారానికి.. నేడు ప్రక్షాళన
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:33 AM
పాలు, పసుపు తదితరాలతో గురువారం ఆలయాలను శుద్ధి చేశారు. ఆలయ ప్రాంగణాలను ఊడ్చి స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యి వాడటంతో వైసీపీ పాలనలో మహాపాపం జరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి ప్రక్షాళనగా తాము ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టామని టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కూటమి నేతలు ప్రకటించారు.
పాలు, పసుపు తదితరాలతో గురువారం ఆలయాలను శుద్ధి చేశారు. ఆలయ ప్రాంగణాలను ఊడ్చి స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యి వాడటంతో వైసీపీ పాలనలో మహాపాపం జరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి ప్రక్షాళనగా తాము ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టామని టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కూటమి నేతలు ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో వీళ్ల అభిప్రాయాలివీ.
ఇప్పుడేం చెబుతారు?
పాలు లేకుండానే కెమికల్స్‌తో నెయ్యి తయారు చేశారని సిట్ తేల్చింది. దీనిపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు? పాలు వాడని కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారుచేసి మహా పాపం చేశారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేయగలరా? ఏ తప్పూ చేయనప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఎందుకు పరుగెడుతున్నారు.
- చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మురకంబట్టులోని వేంకటేశ్వరాలయ శుద్ధి కార్యక్రమంలో..
సమగ్ర విచారణ అవసరం
కల్తీ నెయ్యి.. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. దీనిలో నిజాలు వెలుగులోకి రావడం అత్యంత అవసరం. అందుకని సమగ్ర విచారణ జరపాలి. అలాగే 2019-2024 మధ్య టీటీడీలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, సరఫరా ఒప్పందాలు, నెయ్యి నాణ్యత తదితరాలపై స్పష్టత వచ్చేలా పారదర్శక విచారణ నిర్వహించాలి. ఇందులో అవకతవకలు జరిగినట్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కొండకిందపల్లి వినాయకస్వామి ఆలయ స్వచ్ఛత కార్యక్రమంలో..
ముమ్మాటికి కల్తీ నెయ్యే
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడింది ముమ్మాటికీ కల్తీ నెయ్యేనని సిట్ అధికారులు తేల్చేశారు. హిందువుల మనోభావాలతో ఆడుకుని, నాణ్యతలేని అన్నప్రసాదాలు, కల్తీనెయ్యితో వైసీపీ నేతలు రూ.కోట్లు గడించారు. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆలయ ఆదాయాలను దోచుకున్నారు. దేవాలయాలతో వ్యాపారాలు చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారు.
- జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్, కార్వేటినగరం వేణుగోపాల స్వామి ఆలయ ధ్వజస్తంభం శుద్ధి కార్యక్రమంలో..
అన్నీ అపచారాలే
వైసీపీ పాలనలో శ్రీవారి ఆలయంలో జరగని అపచారం లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్లుగానే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ దర్యాప్తులోనూ శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని తేలింది. సిట్ ఛార్జిషీటు ద్వారా ఈ నిజం నిర్ధారణ అయింది. తప్పు చేసిన వైసీపీ నేతలను ప్రజలే నిలదీయాలి.
- ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పంలోని వరదరాజస్వామి ఆలయ ప్రక్షాళన కార్యక్రమంలో..