దివ్యాంగుల్లో ఆనందం కోసమే..
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:41 AM
దివ్యాంగుల ముఖాల్లో ఆనందం చూడటం కోసమే ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
రాయచోటి, మార్చి18(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల ముఖాల్లో ఆనందం చూడటం కోసమే ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఏటా రూ.200 కోట్లు భారమైనా సంతోషంగా భరిస్తున్నామన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంలో ఆర్టీసీ కృషి అభినందనీయమన్నారు. స్ర్తీశక్తి పథకం ద్వారా 5 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేపట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో 18 నెలల్లో రవాణా సౌకర్యం కోసం 1,450 డీజిల్ బస్సులను కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. రాబోయే మూడేళ్లలో మరో 2,750 కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్ నాయుడు, రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ రాంప్రసాద్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, ఆర్టీసీ ఈడీ, ఆర్‌ఎం రాము, డిపో మేనేజర్ మహేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ నరసింహకుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్‌బాషా, పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వల్లి, వికలాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి పాల్గొన్నారు.