Share News

తొలిసారి మహిళకు ఆలయ అధ్యక్ష పదవి

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:02 AM

తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ కుర్చీ ఎట్టకేలకు బీజేపీని వరించింది.

తొలిసారి మహిళకు ఆలయ అధ్యక్ష పదవి
చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న వేదవతి

తిరుపతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ కుర్చీ ఎట్టకేలకు బీజేపీని వరించింది. ఆపార్టీ మహిళా నేత వేదవతి నేతృత్వంలోని పాలకమండలి సోమవారం ఆలయ ప్రాంగణంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి సుగుణమ్మతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌ సమక్షంలో పాలకమండలి అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. నగరంలో 5 స్థానికాలయాలు ఉంటే ఇప్పటివరకు ఒక మహిళ ఛైర్‌పర్సన్‌ కావడం ఇదే తొలిసారి. పెద్దగంగమ్మ ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ కోసం తొలినుంచి బీజేపీ పట్టుపట్టింది. తొలుత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ కోడూరు బాలసుబ్రమణ్యం అనుచరుడు సతీష్‌ రాజు పేరు వినిపించింది. ఆమేరకు ప్రభుత్వ ఉత్తర్వులోనూ అతనిపేరే ముందువరుసలో ఉంది. కూటమి నాయకుల సూచనల మేరకు బీజేపీకి కేటాయించాల్సి రావడంతో కోడూరు వర్గం పొత్తుధర్మానికి కట్టుబడి సహకరించాల్సి వచ్చింది. దీంతో మహిళా నేత వేదవతి చైర్‌పర్సన్‌గా ప్రమాణం స్వీకారం చేశారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సామంచి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేసి భక్తుల మన్ననలను పొందాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈసందర్భంగా పాలకమండలికి సూచించారు. ఏపీజీబీసీ ఛైర్మన్‌ సుగుణమ్మ, సామంచి శ్రీనివా్‌సలు కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వంశీ కృష్ణా, వాణిశ్రీ, సతీష్‌ రాజు, బుజ్జిబాబు, కోమల, రాశి, అశోక్‌ కుమార్‌, ఆలయ ఈవో మునిశంకర్‌, కూటమి నాయకులు రాజా రెడ్డి, వరప్రసాద్‌, గాలి పుష్పావతి, బ్యాంక్‌ శాంతమ్మ, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 01:02 AM