ఉనికి కోసం..
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:33 AM
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం ఆరాటపడుతోంది. బలమైన నాయకత్వం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో మరీ బలహీనంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పరిరక్షణ యాత్ర’లో భాగంగా శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు.
2009 నుంచీ కోలుకోని కాంగ్రెస్
జిల్లాలో చెప్పుకోదగ్గ నాయకులేరీ?
నేడు పలమనేరు, జీడీనెల్లూరులో వైఎస్ షర్మిల పర్యటన
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం ఆరాటపడుతోంది. బలమైన నాయకత్వం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో మరీ బలహీనంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పరిరక్షణ యాత్ర’లో భాగంగా శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా వెలిగింది. 2009లో వైఎస్సార్ మరణంతో కాస్త, 2014లో రాష్ట్ర విభజనతో పూర్తిగా నీరుగారిపోయింది. అప్పట్నుంచి ఏమాత్రం కోలుకోలేని పరిస్థితి నెలకొంది. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ కుమార్తె షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టడంతో కాస్తయినా పూర్వ వైభవం వస్తుందనుకున్నా, పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో పలమనేరు, కార్వేటినగరం, నగరి ప్రాంతాల్లో ప్రచారం చేసిన షర్మిల కూటమి గాలిలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు.
న్యూట్రల్‌గా ఎంఎస్ బాబు
ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టికెట్ రాలేదని అలిగి కాంగ్రె్‌సలో చేరిన ఎంఎస్ బాబు, ఆపార్టీ తరపున పూతలపట్టు నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కాస్తయినా ప్రభావం చూపించలేకపోయారు. 2820 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఎన్నికల తర్వాత కాంగ్రె్‌సలో పెద్దగా యాక్టీవ్ లేని బాబును, ఆపార్టీ అధిష్ఠానం తప్పించింది. పూతలపట్టు మండలానికి చెందిన ప్రభాకర్‌కు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల్ని అప్పగించింది కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంఎస్ బాబు ప్రస్తుతం న్యూట్రల్‌గా ఉన్నారు. ఆ మధ్య వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసిన ఫొటోలు బయటకు వచ్చాయి.
నిరూపణకు రమే్‌షబాబు ప్రయత్నం
మాజీ మంత్రి నారాయణస్వామి మేనల్లుడు రమేష్ బాబు గత ఎన్నికల్లో జీడీనెల్లూరు నుంచి పోటీ చేయగా, 2682 ఓట్లు వచ్చాయి. వెదురుకుప్పం మండలానికి చెందిన భాస్కర్ స్థానంలో రమేష్ బాబు ఈ మధ్య జిల్లా అధ్యక్షుడి పదవి కూడా తెచ్చుకున్నారు. శుక్రవారం రమేష్ ఆధ్వర్యంలోనే జీడీనెల్లూరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మళ్లీ అడ్జస్ట్ అయిన శివశంకర్
పలమనేరులో పోటీ చేసిన శివశంకర్ ఆర్థికంగా బలవంతుడు కావడంతో అతని మీద కాసింత ఆశలు ఉండేవి. మిగతా వారితో పోల్చుకుంటే ఆయనకు కాస్త మెరుగ్గా 4015 ఓట్లు పడ్డాయి. కానీ, ఆ మధ్య అధిష్ఠానం మీద అలిగి రాజీనామా చేస్తున్నట్లు వీడియో విడుదల చేశారు. మళ్లీ అడ్జస్ట్ అయిపోయి, శుక్రవారం షర్మిల ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు.
మిగిలిన ప్రాంతాల్లో..
ఫ ఇక, నగరిలో పోటీ చేసిన రాకేశ్‌రెడ్డికి 4551 ఓట్లు వచ్చాయి. ఎన్నికల తర్వాత షర్మిలకు వ్యతిరేకంగా వర్గం తయారుచేసుకున్నారని, పార్టీకి విభిన్నంగా పనిచేస్తున్నారనే కారణంగా ఆయన్ను అధిష్ఠానం తప్పించింది. ఆయన స్థానంలో పుత్తూరుకు చెందిన కార్తీక్‌ను నియమించారు.
ఫ చిత్తూరులో ఎప్పుడూ పోటీ చేసే టిక్కీ రాయల్ కాస్త యాక్టివ్‌గా ఉన్నా శ్రేణులు కనిపించడం లేదు.
ఫ కుప్పం, పుంగనూరులో పోటీ చేసిన గోవిందరాజులు, మరళీమోహన్ యాదవ్ జస్ట్ కొనసాగుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మాత్రం అప్పుడప్పుడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రెస్‌మీట్లు పెడుతుంటారు. ఆయనతోనూ పెద్దగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కనిపించరు.
నేడు జీడీనెల్లూరు, పలమనేరులో షర్మిల సభలు
గంగాధరనెల్లూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘ఉపాధిహామీ పథకం పరిరక్షణ యాత్ర’ పేరిట శుక్రవారం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పలమనేరు, సాయంత్రం 4 గంటలకు జీడీనెల్లూరులో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభ కోసం గంగాధరనెల్లూరులో కాంగ్రె్‌సపార్టీ జెండాలు, తోరణాలతో పాటు ఫ్లెక్సీలను గురువారం ఉదయం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తచట్టంతో కార్మికుల పనిహక్కులను దెబ్బతీయడాన్ని కేంద్రం మానుకోవాలనే అంశంపై ఈ సభలో షర్మిల ప్రసంగిస్తారని డీసీసీ అధ్యక్షుడు రమే్‌షబాబు తెలిపారు. నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాలనుంచీ ఉపాధిహామీ కార్మికులు, పార్టీ శ్రేణులు తరలి రావాలని కోరారు.