విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:31 AM
వ్యవసాయంలో విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) జిల్లా నోడల్ అధికారి, కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి బాలమురుగన్ అన్నారు. పీఎండీడీకేవై నోడల్ అధికారిగా నియమితులయ్యాక తొలిసారిగా ఆయన గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లెలో శుక్రవారం పర్యటించారు.
పీలేరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) జిల్లా నోడల్ అధికారి, కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి బాలమురుగన్ అన్నారు. పీఎండీడీకేవై నోడల్ అధికారిగా నియమితులయ్యాక తొలిసారిగా ఆయన గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లెలో శుక్రవారం పర్యటించారు. అధికారులు, రైతులతో మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి కోసం వ్యవసాయ ఉత్పత్తిలో పెంపుదల, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, పంటల విలువ పెంచడం, రైతులకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే లక్ష్యమన్నారు. గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం, మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, వ్యవసాయంలో యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రైతు సంఘాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. పెట్టుబడి వ్యయం తగ్గించడం, సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన, పంటలకు మెరుగైన మద్దతు ధర వంటి చర్యలు చేపడతామన్నారు. పీఎండీడీకేవై ద్వారా జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక రంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రైతులకు సుస్థిర ఆదాయం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో పీఎండీడీకేవై అమలు చేస్తోందని చెప్పారు. ఇందులో అన్నమయ్య జిల్లా కూడా ఉండడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు.
జిల్లాలోని వ్యవసాయ విస్తీర్ణం, సాగవుతున్న పంటలు, వాటికి విత్తనాల సేకరణ, ఎకరాలకు పెట్టుబడి వ్యయం, ఉత్పత్తి, తెగుళ్లు, నివారణకు రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలు, వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు, మార్కెటింగ్ విధానాలను కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ శివనారాయణను అడిగి తెలుసుకున్నారు. పశు సంపద, పాల దిగుబడి, వివిధ డెయిరీలు చెల్లిస్తున్న పాల ధర, ప్రభుత్వ అధీనంలో ఏమైనా డైయిరీలు ఉన్నాయా అంటూ జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్లైని అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన పంటల వివరాలు, మార్కెటింగ్, బెంగళూరు, చెన్నె వంటి మహానగరాలకు జిల్లా నుంచి ఉన్న కనెక్టివిటీపై జిల్లా ఉద్యాన శాఖాధికారి సుభాషిణి తెలియజేశారు. డ్రిప్ ఇరిగేషన్ పథకం వివరాలను ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీప్రసన్న వివరించారు. జిల్లాలో టమోటా, మామిడి విస్తారంగా సాగవుతున్న విషయం తెలుసుకుని వాటి మార్కెటింగ్ సదుపాయాలు, పనిచేస్తున్న ఎఫ్‌పీఓలు, అనుబంధ పరిశ్రమలపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మామిడి, టమోటా పంటల అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్ విధానాల్లో తనకు ఎనిమిదేళ్ల అనుభవం ఉందని, భవిష్యత్తులో తగిన ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుదామని జిల్లా అధికారులకు సూచించారు. అంతకుముందు గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లెలోని రైతు ఈశ్వర్ మహేంద్ర మామిడి తోట, గోళ్ల కృష్ణయ్య నాయుడు డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. యాజమాన్య పద్ధతులు, పెట్టుబడిపై అడిగి తెలుసుకున్నారు. మామిడి కాయల సంరక్షణకు వాడుతున్న కవర్లను పరిశీలించారు. నోడల్ అధికారిని, కలెక్టర్‌ను పీలేరు రైతులు సన్మానించారు. కార్యక్రమంలో ఏడీలు రమణ కుమార్, మజీద్ అహ్మద్, ఏవోలు కరుణాకర్ రెడ్డి, రమాదేవి, ఏఎంసీ చైర్మన్ పురం రామ్మూర్తి, డైరెక్టర్ గోళ్ల కిశోర్ నాయుడు, హెచ్‌వో సుకుమార్ రెడ్డి, తహసీల్దారు శివకుమార్, ఎఫ్‌పీవోల అధ్యక్షులు జయబ్బ నాయుడు, దేవిరెడ్డి రమణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఏఈవోలు నజీర్, అల్తాఫ్, జహీర్, టీడీపీ నేతలు అన్నారెడ్డి, అంజి, వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.