Share News

మధ్యతరగతి భక్తులకు తిరుమలలో వసతిపై దృష్టి

ABN , Publish Date - Apr 09 , 2026 | 02:04 AM

తిరుమలలో మధ్య తరగతి భక్తులకు వసతి కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. బుధవారం సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌ చాట్‌ సందర్భంగా టీటీడీకి సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

మధ్యతరగతి భక్తులకు తిరుమలలో వసతిపై దృష్టి
టీటీడీ ఈవో రవిచంద్ర

తిరుపతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో మధ్య తరగతి భక్తులకు వసతి కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. బుధవారం సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌ చాట్‌ సందర్భంగా టీటీడీకి సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అవన్నీ ఆయన మాటల్లోనే....

అదనపు వసతి అంటే తిరుపతిలోనే

తిరుమలలో వసతి సదుపాయాలను పరిశీలిస్తే ఉన్నత, ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకు మాత్రమే గదులు అందుబాటులో వున్నట్టు అనిపిస్తోంది. కీలకమైన మధ్యతరగతి భక్తుల కోసం తగిన వసతి సదుపాయాలు లేవనే చెప్పాలి. ఇకమీదట మధ్య తరగతి భక్తులు భరించగలిగే అద్దెలతో గదులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం.కొండపై అదనంగా గదులు నిర్మించే ఆలోచన లేదు. వున్న భవనాల్లోనే పాతవి, శిధిలావస్థకు చేరిన వాటిని పునర్నిర్మించే క్రమంలో వాటిని మధ్యతరగతి భక్తులకు కేటాయించేలా చూస్తాం. అదనపు వసతి కల్పించడం అంటే ఇకమీదట తిరుపతిలోనే.

శ్రీవారి సేవను విస్తృతం చేస్తాం

సీఎం చంద్రబాబు సూచించినట్లు శ్రీవారి సేవకుల విభాగాన్ని మరింత విస్తృతం చేస్తాం. దేవదాయ శాఖ పరిధిలోని 27 వేల ఆలయాలతో అనుసంధానం చేసి ఎక్కడికక్కడ ఆలయాల్లో సేవలందించేలా చూస్తాం. ప్రత్యేక దినాల్లో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, అవసరమైన సేవలు అందించడం, చివరికి పూలు కట్టడం వంటి చిన్నపాటి సేవలు కూడా శ్రీవారి సేవకులు చేపట్టే అవకాశముంది.వీరి పనితీరును బట్టి ర్యాంకులు ప్రకటిస్తాం. వాటిని బట్టే వారికి శ్రీవారి ఆలయం, గర్భగుడి వంటి కీలక ప్రదేశాల్లో సేవ చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్నాం.

సాఫీగా శ్రీవారి దర్శనంపై దృష్టి

భక్తులు మూడు నాలుగు క్షణాలైనా శ్రీవారిని సాఫీగా దర్శించుకుని తమ కోరికలు చెప్పుకునే అవకాశం కల్పించాల్సి వుంది.రోజువారీ కైంకర్యాల సమయం మినహాయిస్తే 15-16 గంటలు మాత్రమే దర్శనానికి కేటాయిస్తున్నాం. దర్శన సమయం పెంచాలంటే కైంకర్యాలు తగ్గించాలి. ఆగమ శాస్త్రాల ప్రకారం అలా చేయడానికి వీలు కాదు. దేవస్థానానికి ఆదాయం కల్పించడానికి ప్రవేశపెట్టిన ఆర్జిత సేవల విషయంలో మార్పుచేర్పులు చేయడానికి వీలుంది. ఇపుడు దేవస్థానం ఆర్థిక పరిస్థితి బాగా వున్నందున ఆర్జిత సేవల్లో కొన్నింటిని తీసివేయడం, లేదా వాటిని ఏకాంతం చేసి ఆ సమయంలో కూడా భక్తులను దర్శనానికి అనుమతించడం వంటివి చేయచ్చు.ఆగమ పండితులతో పాటు హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులతో చర్చించి ముందుకెళ్లాల్సి వుంటుంది.

రోజువారీ భక్తుల సంఖ్య పెంచాలి

శ్రీవారిని రోజువారీ దర్శించుకునే భక్తుల సంఖ్య పెంచడంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఇందుకోసం గత పదేళ్ళలో భక్తుల సంఖ్య, రద్దీ వంటివి పరిశీలిస్తున్నాం. ఏయే రోజుల్లో సంఖ్య, రద్దీ తక్కువగా వుందో గుర్తిస్తున్నాం. అలాంటి రోజుల్లో భక్తుల సంఖ్య పెంచడానికి ప్రయత్నిస్తాం.కొండ పైన భక్తుల రద్దీ తక్కువగా వున్న సమయంలో తిరుపతిలో టోకెన్ల సంఖ్య పెంచడం, టోకెన్లు జారీ చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది. ఏఐ టెక్నాలజీ సాయంతో రోజువారీ భక్తుల సంఖ్యను 80 వేల నుంచీ 90 వేలకు, లక్షకు పెంచడానికి ప్రయత్నిస్తాం. వీటన్నింటి మీదా ప్రభుత్వంతో లోతుగా చర్చించి, అధ్యయనం చేశాకే చర్యలు తీసుకుంటాం. ఏ నిర్ణయమైనా టీటీడీ ఆగమ నియమ నిబంధనలకు అనుగుణంగానే వుంటుందనేది స్పష్టం చేస్తున్నాం.

Updated Date - Apr 09 , 2026 | 02:04 AM