ఆగమోక్తంగా ధ్వజావరోహణం
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:44 AM
తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి.
-కృతజ్ఞతలతో దేవతలను సాగనంపిన గరుడాళ్వార్
తిరుమల,సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి):తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. బుధవారం రాత్రి శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల మొదటిరోజు ధ్వజారోహణం సందర్భంగా గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను కృతజ్ఞతలతో తిరిగి పంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలో స్వామివారి ఉత్సవర్లకు విశేష సమర్పణ చేశారు.అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారు బంగారు తిరుచ్చిలో సాయంత్రం 7 గంటలకు తిరువీధుల్లో ఊరేగి ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు ఉత్సవర్లు వేంచేశారు.అర్చకబృందం పూజాది కార్యక్రమాలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఉన్న గరుడ పటాన్ని శాస్త్రోక్తంగా కిందకు దించి బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు ప్రకటించారు.ధ్వజపడి నివేదన కావించి, ఆలయంలోని బంగారువాకిలిలో ఉత్సవర్లకు ఆస్థానం నిర్వహించారు.అంతకుముందు ఉదయం చక్రస్నాన ఘట్టం కనులవండువగా జరిగింది. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం అనంతరం చక్రత్తాళ్వార్ పుష్కరిణిలో మునకలు వేయగానే పుష్కరిణిలో అప్పటికే వేచివున్న వేలాదిమంది భక్తులు గోవింద నామస్మరణలతో స్నానమాచరించారు.అప్పటినుంచి సాయంత్రం వరకు భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించారు.టీటీడీ జీయర్ స్వాములు, చైర్మన్ బీఆర్ నాయుడు,బోర్డు సభ్యులు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు శరత్, గోపీనాథ్,సీవీఎస్వో మురళీకృష్ణ,ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇదే నెలలో మరోసారి గరుడసేవ, చక్రస్నానం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 19వ తేదీన మలయప్ప స్వామి గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.ఈనెల 26వ తేదీన పౌర్ణమి సందర్భంగా మాడవీధుల్లో పౌర్ణమి గరుడసేవను నిర్వహించనున్నారు.25వ తేదీన అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా టీటీడీ చక్రత్తాళ్వారును వరాహస్వామి ఆలయానికి తీసుకెళ్లి ఆగమోక్త పూజాది కార్యక్రమాలు చేపడతారు. అనంతరం అభిషేకం పూర్తి చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. ఇక, 24వ తేదీన భాగ్‌సవారి ఉత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు.బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటిరోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం టీటీడీకి ఆనవాయితీగా వస్తోంది.