ఐదు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:27 AM
రేషన్ బియ్యాన్ని రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు.
రేణిగుంట జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలిస్తున్న ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని తొలుత గోప్యంగా ఉంచారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ప్రతి నెలా రేషన్ దుకాణాలలో లబ్ధిదారులకు ఇచ్చే బియ్యాన్ని శ్రీకాళహస్తి, దొడ్లమిట్ట, నీలసానిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు కొనుగోలు చేసేవారు. తర్వాత శ్రీకాళహస్తిలోని ప్రైవేటు మిల్లులకు తరలించి సన్నబియ్యంలా మార్చి విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈ క్రమంలో నీలసానిపేటలో ఇంట్లో 5 టన్నుల రేషన్ బియ్యం దాచి ఉంచారు. గాజుల మండ్యం పోలీ్‌సస్టేషన్లోని ఓ అధికారి బియ్యం అక్రమ తరలింపునకు సహకరించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి. ఆ విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కేసు నమోదు చేశారని సమాచారం. దీనిపై డీఎస్పీ శ్రీనివాసరావును వివరణ కోరగా రేషన్ బియ్యం పట్టుకుంది వాస్తవమేనని స్పష్టం చేశారు. కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుదారులకు పోలీసుల సహకారంపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. బియ్యం ఉంచిన ఇంటి వద్ద పోలీసులు కాపలా పెట్టారు.
పుత్తూరులో మరో రెండు టన్నులు..
పుత్తూరు అర్బన్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుపతి- చెన్నై జాతీయ రహదారి గొల్లపల్లి క్రాస్ వద్ద పోలీసుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుబడింది. పుత్తూరు నుంచి పలమనేరుకు రెండు టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్‌కుమార్ గుర్తించారు. ఆ వాహనంతో పాటు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ యువరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కిషోర్‌తో కలిసి పుత్తూరు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి పలమనేరులో వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తామని విచారణలో చెప్పినట్ల తెలిసింది. యువరాజ్‌ది పలమనేరు మండలం మలగాంపల్లి కాగా, కిశోర్‌ది పలమనేరు. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.