శతవసంతాల ఏయూకు తొలి వీసీ చిత్తూరువాసి
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:48 AM
926 ఏప్రిల్ 26న పురుడు పోసుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి వైస్ చాన్సలర్ మన చిత్తూరువాసి. ఈ వందేళ్లలో వర్సిటీ సాధించిన అభివృద్ధికి తొలినాళ్లలో బలమైన పునాది వేసింది కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్). విశాఖ వేదికగా ఏయూలో ఆదివారం మొదలైన శతాబ్ది ఉత్సవాలు 26వ తేది వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలి వీసీ అయిన సీఆర్‌పై ప్రత్యేక కథనం.
ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి బలమైన పునాది వేసిన కట్టమంచి
చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి
1926 ఏప్రిల్ 26న పురుడు పోసుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి వైస్ చాన్సలర్ మన చిత్తూరువాసి. ఈ వందేళ్లలో వర్సిటీ సాధించిన అభివృద్ధికి తొలినాళ్లలో బలమైన పునాది వేసింది కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్). విశాఖ వేదికగా ఏయూలో ఆదివారం మొదలైన శతాబ్ది ఉత్సవాలు 26వ తేది వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలి వీసీ అయిన సీఆర్‌పై ప్రత్యేక కథనం.
చిత్తూరుకు ఆనుకుని ఉన్న కట్టమంచిలో 1880 డిసెంబరు 10న సుబ్రహ్మణ్యంరెడ్డి, నారాయణమ్మ దంపతులకు మూడో సంతానంగా రామలింగారెడ్డి జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కట్టమంచిల ప్రాథమిక విద్య.. జిల్లా బోర్డు స్కూలు (ఇప్పటి పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల)లో హైస్కూల్ విద్య పూర్తి చేశారు. 1897లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరారు. తత్వశాస్త్రం, అర్థశాస్త్రం ప్రధానాంశాలుగా 1902లో బీఏలోను, 1906లో ఎంఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1909లో మైసూరులోని మహారాజ కళాశాలలో ఆచార్యుగా చేరారు. 1915లో అదే కళాశాలకు అధ్యక్షుడయ్యారు. 1921లో రాజీనామా చేసి మద్రాసుకు వచ్చిన రామలింగారెడ్డి.. జస్టిస్ పార్టీలో చేరి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 1923 ఎన్నికల్లో చిత్తూరు నుంచి గెలిచి శాసనసభలో అడుగుపెటారు. జస్టిస్ పార్టీలో, యునైటెడ్ నేషలిస్టు పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం 1926 ఏప్రిల్ 26న ప్రారంభం కాగా.. కట్టమంచి రామలింగారెడ్డి దానికి తొలి వీసీగా నియమితులయ్యారు. అలా రాజకీయ రంగాన్ని వదిలారు. వీసీగా తన నెలవారీ వేతనంలో సగాన్ని వర్సిటీ అభివృద్ధికి ఖర్చు చేశారు. దాల నుంచి విరాళాలకూ చొరవ చూపారు. ఆంధ్రజాతి ఔన్నత్యాన్ని ప్రస్ఫుటం చేసేలా విశ్వ విద్యాలయ చిహ్నాన్ని రూపొందించారు. 1930లో వీసీగా రాజీనామా చేశారు. 1935లో చిత్తూరు జిల్లా బోర్డు(జిల్లా పరిషత్) అధ్యక్షుడిగా గెలిచారు. 1936లో మద్రాసు శాసనమండలికి ఎంపిక కావడంతో అదే సంవత్సరం మే 19న బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 1936లో రెండోసారి ఆంధ్ర వర్సిటీ వీసీ పదవిని చేపట్టి 1949 వరకు కొనసాగారు. ఈ సారి ఉత్సాహంతో విద్యాలయ అభివృద్ధికి కృషి చేశారు. అనేత తాళపత్ర గ్రంథాలను సేకరించారు. తంజావూరు సరస్వతి మహల్‌లో అముద్రితంగా ఉన్న ఆంధ్ర గ్రంథాలకు ప్రతులను తయారు చేయించి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ గ్రంథాలయంలో భద్రపరిచారు. సంస్కృత, సారస్వత చరిత్ర, ఆంధ్రభాష చరిత్రను రాయించి ప్రచురించారు. 1949లో రామలింగారెడ్డి వీసీగా రాజీనామా చేసి.. మైసూర్ విశ్వవిద్యాలయ ప్రొ చాన్సలర్‌గా చేరారు. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో 1951 ఫిబ్రవరి 24న మద్రాసులోని ఓ నర్సింగ్ హోమ్‌లో తుదిశ్వాస విడిచారు. సాహిత్య, విద్యా రంగానికి ఆయన చేసిన కృషి గణనీయం. ఆయన కన్న కలలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిరూపం.