Share News

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు తొలి అడుగు

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:48 AM

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ (సమగ్ర ఉద్యాన కేంద్రం) తొలి దశకు అడుగు పడింది. జిల్లాలో సోమవారం మొదలయ్యే వారోత్సవాల్లో.. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు తొలి అడుగు
ఖర్జూర తోటలు

దరఖాస్తుల స్వీకరణకు నేటి నుంచి వారోత్సవాలు

ఐదు క్లస్టర్ల పరిధిలోని 11 మండలాల్లో అమలు

- చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ (సమగ్ర ఉద్యాన కేంద్రం) తొలి దశకు అడుగు పడింది. జిల్లాలో సోమవారం మొదలయ్యే వారోత్సవాల్లో.. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధిలో భాగంగా జిల్లాకు రూ.1529.69 కోట్లు కేటాయించారు. అందులో భాగంగా జిల్లాలోని 27 మండలాలను 20 కస్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్లను మూడేళ్ల (2026-27 నుంచి 2028-29 వరకు) వ్యవధిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో సిద్ధమైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తొలి దశలో ఐదు క్లస్టర్ల పరిధిలో ఏడు మండలాలు.. కుప్పం, రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో సోమవారం నుంచి 17వ తేదీ వరకు ఉద్యాన వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 111 రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతుల నుంచి సమగ్ర ఉద్యాన అభివృద్ధికి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

దరఖాస్తులు ఎలాగంటే..

ఉద్యానాభివృద్ధికి సంబంధించి, తమకు ఉపయోగపడే అంశాలతో రైతులు ఈ వారోత్సవాల్లో దరఖాస్తులు అందజేయాలి. ప్రత్యామ్నాయంగా కొబ్బరి, పామాయిల్‌, ఖర్జూరా తదితర పంటలు వేసుకోవాలన్నా దరఖాస్తులో పేర్కొనాలి. పల్ప్‌ యూనిట్లు, ప్రొసెసింగ్‌ యూనిట్లు, ఫాం మెకనైజేషన్‌, మార్కెటింగ్‌ వాహనాల లాజిస్టిక్‌, పాలిహౌస్‌, ఫాంపాండ్లు, వీట్‌ మ్యాట్స్‌, స్పేయర్లు, యంత్రపరికరాలు, అంతర్‌ పంటల సాగు, దుక్కి దున్నుకోడానికి చిన్నపాటి ట్రాక్టర్లు, కలుపు తీసే యంత్రాలు, పవర్‌ టిల్లర్లు, స్టోరేజ్‌ పాయింట్లు, కోల్డ్‌ స్టోరేజ్‌, ఉత్పత్తులను వేరే ప్రాంతాలకు ఎగుమతులు చేయడానికి అవసరమైన రెఫర్‌ (ఏసీ) వ్యాన్లు, సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్లు, పానీయాల ఉత్పత్తులకు ఉపయోగించే ప్లాస్టిక్‌ బాటిళ్ల తయారీ.. ఇలా ఉద్యాన పంటలకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగించే యూనిట్ల వరకు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు దరఖాస్తులు అందించాలి. ఈ యూనిట్లతో తాము పొందే ప్రయోజనాలనూ రైతులు దరఖాస్తులో పొందుపర్చాలి. రైతుల ఆర్థిక పరమైన వివరాలు, సాగు భూముల వివరాలనూ ప్రస్తావించాలి. ఈ వారోత్సవాల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు వివిధ దశల్లో పరిశీలించి, రైతులు కోరుకున్న వాటికి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తారు. యూనిట్లపై వచ్చే రాయితీలు, బ్యాంకు లింకేజ్‌ సౌకర్యాలు, ఇతర ప్రయోజనాలు కల్పించనున్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

జిల్లాలో సింహభాగం మామిడి సాగు చేసిన రైతులు, ఏటా వాతావరణ, మార్కెటింగ్‌, ఇతర పరిస్థితుల కారణంగా నష్టపోతున్నారు. అలా కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయడంపై అవగాహన కల్పించనున్నారు. లాభసాటి పంటల సాగు చేయడంపై రైతుల్లో చైతన్య కల్పించనున్నారు.

ఇతర ప్రయోజనాలపైనా..:

బోరు నీటి వసతి కలిగిన ప్రతి రైతుకు మైక్రో ఇరిగేషన్‌ అమలు చేయడం, ఎరువుల వాడకం, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడం. ఉన్న పంటల్లో లాభదాయమైన ఉత్పత్తులు వచ్చేలా చర్యలు చేపట్టే అంశాలను వివరిస్తారు.

గ్రామ, అంతర్జాతీయ మార్కెటింగ్‌

రైతులు పండించిన పంటలకు లాభసాటి ధర కల్పించడంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు. చేతికి వచ్చిన పంట సేకరణ, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ యూనిట్లు ఏర్పాటు, ధరల ప్రదర్శన బోర్డులు ఏర్పాటు, మార్కెటింగ్‌, లాజిస్టిక్స్‌ సదుపాయాలు కల్పించనున్నారు. నాణ్యమైన ఉత్పత్తులనకు అంతర్జాతీయ స్థాయిలోనూ ఎగుమతులు చేపట్టేందుకు డిజిటల్‌ ధరల ప్రదర్శన చేస్తారు. రైతులను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం చేయడంతో పాటు లాభసాటి ధరలు, ప్రయోజనాలు కలిగించనున్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:48 AM