Share News

తొలి విడత పంచాయతీ పోరు ప్రశాంతం

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:53 AM

తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రెండు మండలాల్లోని 11 సర్పంచ్‌లు, 110 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సంబేపల్లె మండలంలోని 9 పంచాయతీలకు గాను 77.31శాతం, రామాపురం మండలంలో 84.85 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండింట్లో కలిపి 78.66 శాతం పోలింగ్‌ నమోదైంది.

తొలి విడత పంచాయతీ పోరు ప్రశాంతం
బయారెడ్డిగారిపల్లె పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

110 వార్డుల్లో టీడీపీ 84, వైసీపీ 26

78.66 శాతం పోలింగ్‌ నమోదు

రాయచోటి/రామాపురం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రెండు మండలాల్లోని 11 సర్పంచ్‌లు, 110 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సంబేపల్లె మండలంలోని 9 పంచాయతీలకు గాను 77.31శాతం, రామాపురం మండలంలో 84.85 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండింట్లో కలిపి 78.66 శాతం పోలింగ్‌ నమోదైంది. రాయచోటి డివిజన్‌లోని 6 మండలాల్లో 85 సర్పంచ్‌ స్థానాలు, 861 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 74 సర్పంచ్‌, 751 వార్డు సభ్యుల స్థానాలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. సంబేపల్లె, రౌతుకుంట, దేవపట్ల, రెడ్డివారిపల్లె, నాగిరెడ్డిపల్లె, గుట్టపల్లె, పెద్దబిడికి, సదిపిరివాండ్లపల్లె, శెట్టిపల్లె పంచాయతీలు, 90 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. వృద్ధులు, వికలాంగులు సైతం ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు మహిళలు చంటి బిడ్డలతో వచ్చి ఓటు వేశారు. రౌతుకుంట గ్రామ పంచాయతీలో వైసీపీ మద్దతుదారులు ఎన్నికలను బహిస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. రెడ్డివారిపల్లె పంచాయతీలో నడిమి రాజుగారిపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంబేపల్లె, దేవపట్ల పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఆర్డీవో శ్రీనివా్‌స పరిశీలించి ఓటింగ్‌ సరళిపై ఆరా తీశారు. ఎస్పీ ధీరజ్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత చర్యలను పర్యవేక్షించారు. ఎన్నికల అబ్జర్వర్‌ బబిత పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పెద్ద బిడికి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బయట వ్యక్తులు ఎవరూ రావద్దుంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. 8 మంది సీఐలు, 200 మంది పోలీసు సిబ్బంది, మొబైల్‌, క్విక్‌ రిస్కీ టీంలు బందోబస్తు చూశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వార్డు సర్పంచ్‌ కౌంటింగ్‌ ప్రారంభించారు. సంబేపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద సీఐ శ్రీరామ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లకు సూచనలు చేశారు.

రామాపురంలో ప్రశాంతంగా..

మండలంలోని సుద్దమళ్ల, కల్పనాయునిచెరువు గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రెండు సర్పంచ్‌లతో పాటు 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 84.85 శాతం పోలింగ్‌ నమోదైంది. సుద్దమళ్ల గ్రామ పంచాయతీకి సంబంధించి ఓబుల్‌రెడ్డిగారిపల్లె, బయారెడ్డిగారిపల్లె, ఎర్రంరెడ్డిగారిపల్లెలో పోలింగ్‌ నిర్వహించారు. కల్పనాయునిచెరువు పంచాయతీకి సంబంధించి ఆగ్రహారం ప్రాథమిక పాఠశాలలో, మూలపల్లె యానాది కాలనీ, గాండ్లగుండ్ల హరిజనవాడ కేంద్రాల్లో నిర్వహించారు. ఈ కేంద్రాలను కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పరిశీలించి, పోలింగ్‌ సరళిపై ఆరాతీశారు. కల్పనాయునిచెరువు ప్రాథమిక పాఠశాల పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్నికల అడ్వైజర్‌ బబిత పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాస్‌, రామాపురం తహసీల్దార్‌ వెంకటేశు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీడీపీ 8, వైసీపీ గెలుపు 3

ఎన్నికలు జరిగిన 11 సర్పంచ్‌ స్థానాల్లో 8 టీడీపీ, 3 వైసీపీ గెలుచుకున్నాయి. వార్డుల్లో 110 స్థానాలకు గాను టీడీపీ 84, వైసీపీ 26 స్థానాల్లో విజయం సాధించాయి. విజయం సాధించిన అభ్యర్థులకు అధికారులు డిక్లరేషన్‌ ఫారాలు అందజేశారు.

Updated Date - Nov 27 , 2026 | 01:53 AM