Share News

మొదటి రోజు మందకొడిగా..

ABN , Publish Date - Oct 27 , 2026 | 01:41 AM

జిల్లా, మండల పరిషత్తు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం మొదలైంది. మొదటి రోజు మందకొడిగా సాగింది. ఈ ప్రక్రియ సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటలకు వరకూ సాగింది.

మొదటి రోజు మందకొడిగా..
జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌లోని కేంద్రంలోకి వెళ్తున్న అభ్యర్థులు

మదనపల్లె, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లా, మండల పరిషత్తు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం మొదలైంది. మొదటి రోజు మందకొడిగా సాగింది. ఈ ప్రక్రియ సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటలకు వరకూ సాగింది. జడ్పీటీసీ నామినేషన్లు స్థానిక నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌లో, ఎంపీటీసీ నామినేషన్లు ఆయా మండల పరిషత్తు కార్యాలయాల్లో చేపట్టారు. జిల్లాలోని 25 మండలాల జడ్పీటీసీలకు 189 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 88 తిరస్కరణకు గురయ్యాయి. అలాగే 321 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,449 నామినేషన్లు దాఖలు కాగా, 308 తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి బాధిత అభ్యర్థులు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి వద్ద అప్పీలు చేసుకోగా, నిబంధనల ప్రకారం పరిష్కరించారు. సోమవారం నామినేషన్ల విత్‌డ్రాలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి అభ్యర్థులు కేంద్రం వద్దకు వచ్చారు. తమకు పోటీగా వేసిన, రెండు సెట్లు నమోదు చేసిన అభ్యర్థులు వాటిని ఉపసంహరించే ప్రక్రియను మొదలుపెట్టారు. పోటీ ఉన్న, స్వంతంత్రులుగా బరిలోకి దిగిన అభ్యర్థులను ఆయా పార్టీల నేతలు బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3గంటలతో ఈ ప్రక్రియ ముగియనుంది. రెండో రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Oct 27 , 2026 | 01:41 AM