నాటు తుపాకీతో కాల్చింది మద్యం మత్తులోనే..!
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:57 PM
ఉదయం నుంచీ పేకాట ఆడుతూ.. మద్యం తాగుతున్నారు. ఆ మత్తులో అప్పు చెల్లించాలని అడగ్గా.. జరిగిన గొడవలో సాయికుమార్ మాట తూలాడు.
ఉదయం నుంచీ పేకాట ఆడుతూ.. మద్యం తాగుతున్నారు. ఆ మత్తులో అప్పు చెల్లించాలని అడగ్గా.. జరిగిన గొడవలో సాయికుమార్ మాట తూలాడు. అదే మత్తులో విచక్షణ మరచిన ఢిల్లీబాబు నాటు తుపాకీ తీసుకొచ్చి కాల్చిచంపాడు. ఇలా చిత్తూరు రూరల్ మండలంలో తుమ్మిందలో బుధవారం జరిగిన యువకుడి హత్యకు మద్యం మత్తు కారణమని స్థానికులు అంటున్నారు.
- చిత్తూరు రూరల్, ఆంధ్రజ్యోతి
చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మింద పంచాయతీ కేంద్రం గుడిపాల మండలానికి అనుకొని ఉంటుంది. చుట్టూ అటవీ ప్రాంతం. గతంలో ఈ ప్రాంతంలో సారా తయారీ, అమ్మకం జోరుగా సాగేది. కూటమి ప్రభుత్వం రాగానే వాటి జోరు తగ్గింది. దీంతో అందరూ మద్యంపై పడ్డారు. దీంతో మద్యం బెల్టు షాపులు పుట్టుకొచ్చాయి. ఒక్క తుమ్మిందలోనే సుమారు 15 బెల్టు షాపులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వీటికి అధిక శాతం మద్యం గుడిపాల మండలం నుంచి వస్తోందని సమాచారం. ఈ గ్రామం చుట్టుపక్కల మందుబాబులు మద్యం కోసం తుమ్మింద గ్రామానికే వస్తుండడంతో బెల్టు షాపులకు గిరాకీ పెరిగింది. ఈ గ్రామం నుంచి చిత్తూరుకు రావాలంటే సుమారు 15 కిలోమీటర్లు దూరం ఉంది. దీంతో రేటు కాస్త ఎక్కువైనా ఇక్కడే మద్యం కొని తాగి ఊగుతున్నారు. ప్రైవేటు మద్యం షాపులకు అనుమతిచ్చాక కొన్ని రోజులు ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ అధికారులు హడివుడి చేసి మద్యం అక్రమ అమ్మకాలు, రవాణాలపై కేసులు పెట్టారు. ప్రస్తుతం వాటివైపు కన్నెత్తి చూడకపోవడంతో బెల్టు వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. ఇక, మద్యం తాగేందుకే గ్రామంలో కొన్ని స్థావరాలను మందుబాబులు ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది. అలా బుధవారం ఓ పాడుబడిన ఇంట్లో ఢిల్లీబాబు, సాయికుమార్, మరో ఇద్దరు పేకాట ఆడుతూ, మద్యం తాగుతూ గడిపారు. ఈ సమయంలో అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఢిల్లీబాబును సాయికుమార్ అడిగాడు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఢిల్లీబాబును, అతడి ఇంట్లో వాళ్లను సాయికుమార్ దుర్భాషలాడాడు. ఢిల్లీబాబు ఇంటికి వెళ్లి నాటు తుపాకీ తీసుకొచ్చి వరసకు సోదరుడైన సాయికుమార్‌ను కాల్చిచంపాడని స్థానికులు చెబుతున్నారు. తమ గ్రామంలో బెల్టు షాపులను కట్టడి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయని ఆందోళన చెందుతున్నారు.
తుమ్మిందలో పోలీస్ పికెట్
తుమ్మింద గ్రామంలో హత్య నేపథ్యంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. సాయికుమార్ మృతదేహానికి గురువారం పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో హత్యకు ప్రతీకార చర్యలేవి జరగకుండా ఉండేందుకు తాలూకా పోలీసులు గట్టి చర్యలే తీసుకున్నారు. ఉదయం నుంచి తాలుకా సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు అశోక్ కుమార్, వెంకటనారాయణ, ఎన్‌ఆర్ పేట ఎస్‌ఐ మణికంఠేశ్వర రెడ్డి, ఒక హెడ్ కానిస్టేబుల్, 9మంది స్పెషల్ ఫోర్స్ 14 మంది పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు ముగిసేంత వరకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. రాత్రంతా ఈ టీం గ్రామంలోనే ఉంటుందని, అవసరమైతే ఆ తర్వాత కూడా కొనసాగిస్తామని సీఐ తెలిపారు.