Share News

ఫర్నిచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - May 23 , 2026 | 12:51 AM

కల్లూరులో ఫర్నిచర్‌ దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

ఫర్నిచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

కల్లూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలం కల్లూరులో ఫర్నిచర్‌ దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాపారి నివాసమున్న మూడో అంతస్తులోకీ మంటలు వ్యాపించాయి. వీరు సమయస్ఫూర్తితో మిద్దెపైకి వెళ్లి, పక్క భవనంపైకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. గుర్రంకొండ నూర్‌బాషా గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఫర్నిచర్‌ దుకాణం నడుపుతున్నారు. తన భార్య, ముగ్గురు కుమారులు, కోడలు, మనవడు, మనవరాలితో కలిసి మూడంతస్తుల భవనంలో కాపురం ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఫర్నిచర్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఇంట్లోని వారు గమనించేలోగా మంటలు మూడో అంతస్తులోకి వ్యాపించాయి. నూర్‌బాషా భార్య, కోడలు, ఇద్దరు కుమారులు, మనువడు, మనవరాలు మిద్దెపైకి చేరుకుని, పక్కనున్న భవనంపైకి దూకేశారు. మంటలను ఆర్పేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించారు. అప్పటికే కింద దుకాణంలోని పరుపులు, దూది, నార, దిండ్లు, ఫర్నిచర్‌ కాలిబూడిదయ్యాయి. భవనం పరిసరాల్లో పొగ కమ్ముకుంది. ఆ భవనంలో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందారు. స్థానికుల సమాచారంతో అన్నమయ్య జిల్లా పీలేరు ఫైర్‌స్టేషన్‌ ఎస్‌ఎ్‌ఫవో భాస్కర్‌రెడ్డి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిచ్చెన సాయంతో మిద్దెపైకి చేరుకొని సిలిండర్లను సమీపంలోని భవనంలోకి తీసుకొచ్చారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో చట్టుపక్కల ఇళ్లలో కాపురముంటున్న వారు బయటకు పరుగులు తీశారు. భవన యజమాని కుటుంబాన్ని ఆదుకుంటామని తహసీల్దార్‌ జయసింహా తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును నూర్‌బాషాను అడిగి తెలుసుకున్నారు. తక్షణసాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తామన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:51 AM