పులికాట్ సరిహద్దు వివాదానికి పరిష్కారం చూపండి
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:09 AM
పులికాట్ సరస్సులో ఏపీ, తమిళనాడు మత్స్యకారుల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్ర పులికాట్ మత్స్యకార సంక్షేమ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు డి.వాసు, ప్రధాన కార్యదర్శి కె.వాసు కోరారు.
తిరపతి(కలెక్టరేట్), ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): పులికాట్ సరస్సులో ఏపీ, తమిళనాడు మత్స్యకారుల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్ర పులికాట్ మత్స్యకార సంక్షేమ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు డి.వాసు, ప్రధాన కార్యదర్శి కె.వాసు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద గురువారం మత్స్యకారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పులికాట్ పరిధిలో 17 మత్స్యకార గ్రామాలుండగా.. సుమారు 15వేల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ఇరు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య 1988నుంచి తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. సరస్సులో సరిహద్దు స్పష్టంగా లేకపోవడమే సమస్యకు కారణమన్నారు. గతంలో గుర్తులు ఉండేవని.. ప్రస్తుతం అవి తొలగిపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్దీవో, తహసీల్దారుకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని.. కలెక్టర్ చొరవ తీసుకుని సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. రాజేంద్రన్, సంజయ్, వేదముత్తు, సుధాకర్, సెల్వం తదితరులు పాల్గొన్నారు.