Share News

ఎట్టకేలకు ఫ్రీహోల్డ్‌ భూములకు మోక్షం

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:28 AM

వైసీపీ నేతలు పెద్దఎత్తున ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో అక్రమాలు చేసుకుని రూ.కోట్లు వెనకేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం ఫ్రీహోల్డ్‌ భూముల్ని రిజిస్ర్టేషన్లు కాకుండా నిలిపేసింది. అక్రమాలను విచారించి.. నిబంధనలకు అనుగుణంగా చేసుకున్న భూములకు మాత్రమే విముక్తి కల్పించనుంది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయి.

ఎట్టకేలకు ఫ్రీహోల్డ్‌ భూములకు మోక్షం

పచ్చజెండా ఊపిన మంత్రివర్గ ఉపసంఘం

వైసీపీ నేతలు పెద్దఎత్తున ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో అక్రమాలు చేసుకుని రూ.కోట్లు వెనకేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం ఫ్రీహోల్డ్‌ భూముల్ని రిజిస్ర్టేషన్లు కాకుండా నిలిపేసింది. అక్రమాలను విచారించి.. నిబంధనలకు అనుగుణంగా చేసుకున్న భూములకు మాత్రమే విముక్తి కల్పించనుంది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయి.

చిత్తూరు, ఆంధ్రజ్యోతి

జిల్లాలో మొత్తం 1,59,327.5 ఎకరాలను ఫ్రీహోల్డ్‌గా మార్చగా, వాటిలో 1,05,409.7 ఎకరాలను అక్రమంగా చేసుకున్నట్లు తేలింది. దీంతో మొత్తం 1,59,327.5 ఎకరాల రిజిస్ర్టేషన్లనూ ప్రభుత్వం నిలిపేసింది. అక్రమ ఫ్రీహోల్డ్‌ భూములను ఏం చేయాలి? చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి అంశాల్లో నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం, కమిటీలను ఏర్పాటు చేసింది. నిర్ణయం తీసుకునే విషయంలో రెండు నెలల చొప్పున వాయిదాలు వేస్తూనే వస్తున్నారు. ఇలా రిజిస్ర్టేషన్లు ఆపేసి ఇప్పటికే 19 నెలలు కావొస్తోంది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో సక్రమంగా ఫ్రీహోల్డ్‌ అయిన భూములకు క్లియరెన్సు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

‘ఫ్రీహోల్డ్‌’లో అక్రమాలు జరిగాయిలా..

పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన వ్యవసాయ భూములను (డీకేటీ, ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ వంటి పట్టాలు), 20 ఏళ్లు నిండాక అమ్ముకోవచ్చని 2023లో వైసీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ ఆదేశాలిచ్చింది. దీంతో వైసీపీ నేతలు ముందుగానే పేదల నుంచి తక్కువ ధరకు ఆ భూములను కొనుగోలు చేసి, ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక ఫ్రీహోల్డ్‌గా మార్చుకున్నారు. 20 ఏళ్లు పూర్తికాని పట్టాల్ని కూడా ఫ్రీహోల్డ్‌ చేసుకున్నారు. అక్రమ జాబితాలో అభ్యంతరాలున్న పోరంబోకు భూములూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిపై విచారణ చేసి, మొత్తం ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లను ఆపేస్తూ 2024 ఆగస్టు 10న ఆదేశాలిచ్చింది.

ఈ మూడు మండలాల్లో పెద్దఎత్తున అక్రమాలు..

రాష్ట్రంలో ఫ్రీహోల్డ్‌ అక్రమాలు పెద్దఎత్తున జరిగిన మొదటి 10 మండలాలను గతేడాది ప్రభుత్వం విడుదల చేసింది. అందులో మన జిల్లాకు సంబంధించి 4, 5, 10 స్థానాల్లో వి.కోట, కుప్పం, బంగారుపాళ్యం మండలాలున్నాయి. వి.కోట మండలంలో మొత్తం 12,226 ఎకరాల డీకేటీని ఫ్రీహోల్డ్‌ భూములుగా మార్చితే.. వాటిలో అత్యధికంగా 9,243 ఎకరాలు అక్రమమని తేలాయి. అలాగే కుప్పం మండలంలో 8674 ఎకరాల్ని ఫ్రీహోల్డ్‌ చేస్తే, 8400 ఎకరాలు అక్రమంగా చేశారు. బంగారుపాళ్యంలో 8042 ఎకరాల్లో 7198 ఎకరాలు అక్రమమే. ఈ మూడు మండలాలతో పాటు చిత్తూరు అర్బన్‌, గుడిపాల, తవణంపల్లె, ఐరాల, గుడుపల్లె వంటి మండలాల్లోనూ పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. కాగా, అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలో 11,771 ఎకరాల్లో 7740 ఎకరాల్ని అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేశారు. ఇది టాప్‌ 8లో ఉంది. అలాగే పెద్దిరెడ్డి ఇలాకా ఒక్క పుంగనూరు నియోజకవర్గంలోనే 35 శాతం అక్రమాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఫ్రీహోల్డ్‌ భూముల్లో వైసీపీ అక్రమాలు ఇలా..

రాష్ట్రంలో (ఎకరాల్లో..) జిల్లాలో

ఫ్రీహోల్డ్‌ చేసిన మొత్తం భూములు 13.59 లక్షలు 1.59 లక్షలు

అక్రమంగా చేసుకున్నవి 5.74 లక్షలు 1.05 లక్షలు

నిబంధనల మేరకు చేసినవి 7.85 లక్షలు 53,917

నిబంధనల మేరకు ఫ్రీహోల్డ్‌ చేసుకున్న 7.85 లక్షల ఎకరాలకు విముక్తి కల్పించేందుకు మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలోనూ 53,917 ఎకరాల భూములకు విముక్తి కలగనుంది.

Updated Date - Feb 26 , 2026 | 01:28 AM