Share News

జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:58 AM

జడ్పీటీసీలు, మండలాధ్యక్షులు.. ఏ వర్గానికి ఏ స్థానం అనేది తేలిపోయింది. మొత్తం 28 మండలాల్లో చిత్తూరు అర్బన్‌ మినహాయిస్తే.. 27కు సంబంధించి మంగళవారం రాత్రి రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీనికోసం చిత్తూరులోని జడ్పీ కార్యాలయంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, ఇతర అధికారులు రిజర్వేషన్ల కసరత్తులో పాల్గొన్నారు.

 జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు
జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల కసరత్తుకు కేంద్రమైన జడ్పీ కార్యాలయం

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీలు, మండలాధ్యక్షులు.. ఏ వర్గానికి ఏ స్థానం అనేది తేలిపోయింది. మొత్తం 28 మండలాల్లో చిత్తూరు అర్బన్‌ మినహాయిస్తే.. 27కు సంబంధించి మంగళవారం రాత్రి రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీనికోసం చిత్తూరులోని జడ్పీ కార్యాలయంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, ఇతర అధికారులు రిజర్వేషన్ల కసరత్తులో పాల్గొన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు రిజర్వేషన్లు ఖరారై.. జాబితా బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రిజర్వేషన్ల వారీగా ఈ రెండు పదవుల కోసం పోటీచేసే ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇన్నాళ్లు పోటీలో ఉన్న ఇతర సామాజిక వర్గీయులు నిరాశ చెందారు. ఇక, రిజర్వేషన్లలో ఎంపీపీ పదవి చేజారడంతో.. ఇంకొందరు ఆశావహులు ఎంపీటీసీ స్థానమైనా అనుకూలంగా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందితే, వైస్‌ ఎంపీపీ కావచ్చన్న యోచనలో ఉన్నారు. మొత్తమ్మీద తుది జాబితా వెలువడటంతో ఆయా మండలాల్లో అభ్యర్థుల ఎంపిక, రాజకీయ సమీకరణాలపై చర్చలు ఊపందుకున్నాయి.

బీసీలకు పెద్దపీట

జడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్ష స్థానాల రిజర్వేషన్ల జాబితా ప్రకారం బీసీలకు రెండు విభాగాల్లో కలిపి మొత్తం 17 స్థానాలు కేటాయించారు. ఇందులో జడ్పీటీసీ స్థానాల్లో 8, ఎంపీపీ స్థానాల్లో 9 ఉన్నాయి. మొత్తం 54 (జడ్పీటీసీ, ఎంపీపీ) స్థానాల్లో బీసీలకు 17 స్థానాలు కేటాయించడంతో 31.48 శాతం ప్రాతినిధ్యం లభించింది. జడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు 29.63 శాతం, ఎంపీపీ స్థానాల్లో 33.33 శాతం కేటాయింపులు జరిగాయి. ఇక, మహిళలకు కూడా బీసీ రిజర్వేషన్లలో ప్రాధాన్యం లభించింది. జడ్పీటీసీ.. ఎంపీపీ పదవుల్లో మూడేసి చొప్పున ఆరు బీసీ మహిళలకు కేటాయించారు.

మహిళలకు 26 స్థానాలు

రిజర్వేషన్లలో మహిళలకు గణనీయమైన ప్రాధాన్యం లభించింది. జిల్లాలోని 27 జడ్పీటీసీ స్థానాల్లో 13.. 27 మండలాధ్యక్ష పదవుల్లో మరో 13 స్థానాలు కలిపి మొత్తం 26 పదవులను కేటాయించారు. జడ్పీటీసీ, ఎంపీపీ విభాగాల్లోని మొత్తం 54 స్థానాల్లో ఒకటి తక్కువ.. సగం పదవులు మహిళల ఖాతాలోకి వెళ్లాయి. ఈ కేటాయింపులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ప్రాధాన్యం పెరిగింది. మరోవైపు తమకు అనుకూలమైన రిజర్వేషన్‌ వస్తుందని ఆశించిన కొందరు నాయకులకు నిరాశ ఎదురవగా, మరికొందరికి పోటీకి మార్గం సుగమమైంది. మహిళలకు రిజర్వు అయిన చోట్ల చాలా మంది నేతలు తమ కుటుంబంలోని వారిని పోటీల్లో దించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

ఇక,

ఫ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఖరారైన రిజర్వేషన్లు

మండలం జడ్పీటీసీ ఎంపీపీ

------------------------------------------------------------------------------------------

బైరెడ్డిపల్లె బీసీ(జనరల్‌) జనరల్‌ (మహిళ)

బంగారుపాళ్యం జనరల్‌ (మహిళ) ఎస్సీ

చిత్తూరు ఎస్సీ (మహిళ) జనరల్‌

జి.డి.నెల్లూరు ఎస్సీ (మహిళ) జనరల్‌

గంగవరం జనరల్‌ బీసీ (మహిళ)

గుడిపాల జనరల్‌ ఎస్సీ (మహిళ)

గుడుపల్లె జనరల్‌ (మహిళ) బీసీ (మహిళ)

ఐరాల ఎస్సీ(జనరల్‌) జనరల్‌

కార్వేటినగరం జనరల్‌ ఎస్సీ

కుప్పం జనరల్‌ (మహిళ) బీసీ (జనరల్‌)

నగరి బీసీ (మహిళ) జనరల్‌

నిండ్ర ఎస్సీ (జనరల్‌) ఎస్టీ (మహిళ)

పలమనేరు జనరల్‌ జనరల్‌ (మహిళ)

పాలసముద్రం జనరల్‌ (మహిళ) ఎస్సీ (మహిళ)

పెద్దపంజాణి జనరల్‌ బీసీ (మహిళ)

పెనుమూరు జనరల్‌ (మహిళ) జనరల్‌

పులిచెర్ల బీసీ (జనరల్‌) జనరల్‌ (మహిళ)

పూతలపట్టు జనరల్‌ జనరల్‌

రామకుప్పం ఎస్టీ (మహిళ) బీసీ (జనరల్‌)

రొంపిచెర్ల బీసీ (మహిళ) జనరల్‌ (మహిళ)

శ్రీరంగరాజపురం ఎస్సీ (మహిళ) జనరల్‌

శాంతిపురం జనరల్‌ బీసీ(జనరల్‌)

తవణంపల్లె జనరల్‌ ఎస్సీ (మహిళ)

వి.కోట బీసీ(జనరల్‌) జనరల్‌ (మహిళ)

వెదురుకుప్పం జనరల్‌ (మహిళ) ఎస్సీ

విజయపురం ఎస్సీ జనరల్‌ (మహిళ)

యాదమరి బీసీ (మహిళ) జనరల్‌

Updated Date - Oct 14 , 2026 | 01:58 AM