Share News

పెద్దేరు జలాలపై పోటాపోటీ

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:52 AM

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దేరు ప్రాజెక్టు నీటి విడుదలకు ఆయా గ్రామాల ప్రజలు పట్టుపడుతున్నారు.

పెద్దేరు జలాలపై పోటాపోటీ
పెద్దేరు ప్రాజెక్టు

మదనపల్లె, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దేరు ప్రాజెక్టు నీటి విడుదలకు ఆయా గ్రామాల ప్రజలు పట్టుపడుతున్నారు. అందుబాటులోని నీటిని విడుదల చేస్తే వినియోగించుకుంటామని కోరుతున్నారు. పంటలు లేకున్నా నీటిని వదిలితే ప్రాజెక్టు ఖాళీ అవుతుందని, ఏటి పాలవుతాయని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతూ వచ్చారు. రైతులు, రాజకీయ నేతల నుంచి ఒత్తిడి రావడంతో 24 గంటలు నీరు వదలాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. జూలై 17న ఉదయం 9గంటలకు గేటుఎత్తి నీటిని కుడికాలువ ద్వారా పెద్దేరు ఏటికి వదిలారు. మరుసటి రోజు 9గంటలు అంటే 24 గంటలు అయినా రైతులు కోరినట్లు నీరు పెద్దమండ్యం మండలం దిగువపల్లె గమ్యస్థానం చేరలేదు. ఇలా మూడురోజుల పాటు ప్రవాహాన్ని కొనసాగించారు. నాలుగో రోజు గేటు మూసేశారు. ఈ క్రమంలో తమకూ నీరు దండువారిపల్లె రైతులు డిమాండ్‌ చేశారు. వాస్తవంగా నీటిని విడుదల చేయాలని మొదట్లో అడిగింది ఈ రైతులే. కానీ వారికి వదలకుండా రాజకీయ నేతల ఆదేశాలతో దిగువపల్లెకు వదిలారు. దీన్ని సీరియ్‌సగా తీసుకున్న ఈ ప్రాంత రైతులు ఒత్తిడి తీసుకురావడంతో ఇరిగేషన్‌ అధికారులు ఎడమ కాలువ ద్వారా దండువారిపల్లెకూ న్యాయం చేశారు.

ఎమ్మెల్యే ఒత్తిడితో మరోసారి విడుదల

టీడీపీ నేత ద్వారా పని అయ్యిందని భావించిన అక్కడి వైసీపీ నాయకుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని ఆశ్రయించి మరోసారి అధికారులపై ఒత్తిడి చేయించినట్లు తెలిసింది. దీంతో మరోసారి కుడికాలువ ద్వారా అక్కడి నుంచి పెద్దేరు ఏరు వెంబడి వదిలారు. రెండు రోజులు నీటిని విడుదల చేసినా చివరకు పెద్దేరు నీరంతా ఏటిపాలు అయిందే తప్పా గమ్యస్థానం దిగువపల్లె ఏరియాలోని తండాల పరిసర ప్రాంతాలకు చేరలేదు. వీరందరినీ చూసిన మరికొందరు ఆయకట్టు రైతులు ముందుకొచ్చారు. తమకూ నీటిని వదలాలని పట్టుపట్టారు. వారి తరహాలోనే అధికారులకు ఫోన్‌ చేయించారు. దీంతో అధికారులు ఎడమకాలువ ద్వారా ఎనిమిదో కి.మి. వద్దనున్న రెండు చెరువులకు మళ్లించారు. ఇలా ఒకరిని చూసి ఇంకొకరు..వీరిని చూసి మరొకరు పెద్దేరు జలాలపై పట్టు బిగించారు. అప్పటికే ప్రాజెక్టులోని నీరు 30 ఎంసీఎ్‌ఫటీల వరకూ తగ్గిపోవడంతో ఎగువనున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. గుండ్లపల్లె, చౌడసముద్రం, గోపిదిన్నె తదితర గ్రామాల రైతులు కూడా ఒత్తిడి చేయడంతో మూడురోజుల క్రితం తెరిచిన గేట్లను సోమవారం మూసేశారు. పెద్దేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 560 ఎంసీఎ్‌ఫటీలు కాగా ప్రస్తుతం 420 ఎంసీఎ్‌ఫటీలకు చేరుకుంది.

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండిపోతున్నాయి. వర్షాభావంతో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం పంటలు, నీటి వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీరైనా నిల్వ ఉంటే దిగువ ప్రాంతంలోని రైతుల వ్యవసాయ బావులు, బోర్లు వృద్ధిలోకి వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో నీటి విడుదలకు మొదట్లో ససేమిరా అన్న నీటిపారుదలశాఖ డివిజన్‌ స్థాయి అధికారి కలెక్టర్‌ అనుమతి కావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో నాలుగు రోజుల పాటు కార్యాలయం చుట్టు తిరిగి అనుమతి తీసుకోగా నీటిని వదిలిన ఆ అధికారి ప్రస్తుతం కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌ చేశారు. కలెక్టర్‌ అనుమతి లేకుండా వదిలేశారు. గత ఐదేళ్లలో వైసీపీతో అంటకాగిన ఆ అధికారి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినా తంబళ్లపల్లెకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆదేశాలతో వరుసగా నీటిని విడుదల చేసినట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. మిగిలిన గ్రామాల రైతులు ఆ అధికారి తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటివరకూ నాలుగుసార్లు నీటిని విడుదల చేసినా కనీసం పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు సంఘానికి సమాచారం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Aug 13 , 2026 | 12:52 AM