ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సర్వేపై నేటితో క్షేత్రస్థాయి విచారణ పూర్తి
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:32 AM
గ్రామపంచాయతీ ఎన్నికల ముందస్తు ప్రక్రియలో కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు సర్వేలో వచ్చిన అభ్యంతరాలపై గత నెల 29న మొదలైన క్షేత్రస్థాయి విచారణ.. బుధవారంతో ముగియనుంది.
రేపటి నుంచి 6వ తేదీ వరకు గ్రామసభలు
7న తుది జాబితా ప్రచురణ
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల ముందస్తు ప్రక్రియలో కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు సర్వేలో వచ్చిన అభ్యంతరాలపై గత నెల 29న మొదలైన క్షేత్రస్థాయి విచారణ.. బుధవారంతో ముగియనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ముసాయిదా జాబితా మేరకు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీగా పేర్ల మార్పుకోసం ఫారం-2, పేర్లు చేర్చడంపై ఫారం -3, అభ్యంతరాలు, ఒకవేళ తనకు తెలియకుండా తన పేరు చేర్చారని, దానిని తొలగించాలంటూ ఫారం-4ను ఓటర్లు అందజేశారు. వీటిపై ఆయా ఎంపీడీవోల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. బుధవారంతో ఈ విచారణ ముగియగానే.. గురువారం నుంచి 6వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లలో అర్హులుగా గుర్తించిన వారి వివరాలను అధికారులు ఆయా సభల్లో చదివి వినిపించి ఆమోదం పొందుతారు. 7వ తేది తుది జాబితా ప్రచురిస్తారు.