Share News

వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

ABN , Publish Date - Jul 27 , 2026 | 01:50 AM

తిరుమలలోని శ్రీవారి పాదాల చెంత ఆదివారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత పూజ సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల నుంచి మేదరమెట్టుకు చేరుకున్నారు.

వేడుకగా ఛత్రస్థాపనోత్సవం
శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

తిరుమల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని శ్రీవారి పాదాల చెంత ఆదివారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత పూజ సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల నుంచి మేదరమెట్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయణగిరికి వెళ్లారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి రోజు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండటంతో మరింత ఎక్కువ గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుడిని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 01:50 AM