నారావారిపల్లెలో పండగ జోష్
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:38 AM
జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. సెలవులకంతా ఇళ్లకు చేరడంతో కోలాహలంగా మారింది. ఒక్కో ఊరిలో ఒక్కోలా.. పిల్లలు, యువకులు ఆటలాడుతూ సరదాగా గడుపుతున్నారు. బుధవారం తెల్లవారుజామున భోగి మంటలు వేసేందుకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారిపల్లెకు రావడంతో సందడి కనిపించింది.
చంద్రగిరి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఎప్పటిలాగే ఈ సంక్రాంతికీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా సొంతూరు నారావారిపల్లెకు వచ్చారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం మహిళలకు ముగ్గులు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఉదయం 10.40 గంటలకు బయటకు వచ్చిన చంద్రబాబు.. ముగ్గులు వేస్తున్న మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ అభివాదం చేశారు. గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ముగ్గులు వేశారు. ఇక, చిన్నారుల కోసం మ్యూజికల్ చైర్స్, పొటాటో గ్యాథరింగ్, గన్నీ బ్యాగ్, వాకింగ్ బెలూన్, లెమన్ ఇన్ స్పూన్, టెయిల్ పికింగ్, సెల్ఫ్ డిఫెన్సు వంటి ఆటలను తరగతుల వారీగా నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలను సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరై వీక్షించారు. విజేతలైన చిన్నారులకు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు బహుమతులను అందజేశారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ముగ్గులు వేసే మహిళలను భువనేశ్వరి పలకరించారు. వారితో ఫొటోలు దిగారు. ఆటల పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు బ్రాహ్మణి మాట్లాడి ‘ఐ విష్‌యు ఆల్ ది బెస్ట్’ అంటూ ప్రోత్సహించారు. ఈ ఆటల పోటీల్లో నారా దేవాన్ష్ లెమన్ అండ్ స్పూన్ పోటీల్లో పొటాటో గ్యాథరింగ్‌లో ఆర్యవీర్ బహుమతి పొందారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్, ఆయన సతీమణి తేజస్విని, నారా రోహిత్, శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, స్టేట్‌మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ, సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి నారావారిపల్లె వచ్చిన సీఎం చంద్రబాబు.. అటు అభివృద్ధి పనులవైపూ దృష్టి పెట్టారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ప్రజారోగ్యానికి డిజిటల్ దిశ చూపే ‘సంజీవని’ ప్రాజెక్టును చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ నారావారిపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డీజీనెర్వ్ సెంటర్ సేవలను సీఎం ప్రారంభించారు. తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఈసేవలను విస్తరించేలా ప్రభుత్వం కార్యచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
నారావారిపల్లెలో రూ.4.27 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్‌ను... యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు రూ.1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. అలాగే 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.77 లక్షలతో ఎ.రంగంపేట- భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వరస్వామి ఆలయం వరకు నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించారు.
తిరుపతిలో అభివృద్ధి పనులకూ..
తిరుపతిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నారావారిపల్లెలో శిలాఫలకాలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రుయాస్పత్రిలో రూ.45 లక్షలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ అమినిటీస్ కాంప్లెక్స్‌ను, ఎస్వీ యూనివర్శిటీలో రూ. 7.5 కోట్లతో నిర్మించిన మహిళా హాస్టల్‌ను ప్రారంభించారు. ఎస్వీయూలో రూ.6 కోట్లతో కేంద్రీకృత పరిశోధనా ల్యాబ్‌కు.. రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్థు నిర్మాణానికి, రూ.2.91 కోట్లతో ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నీవా బ్రాంచ్ కెనాల్‌కు..
నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యామ్, మూలపల్లి చెరువు సహా మరో నాలుగుంటికి నీటిని తరలించే పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దీనికి రూ.126 కోట్లను వెచ్చించనున్నారు. రూ.10 లక్షలతో పశువుల వసతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.