ఈ-పంట ఆధారంగా రైతులకు ఎరువుల కోటా
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:06 AM
‘ఈ-పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగా ప్రతి రైతుకూ ఎరువుల కోటా నిర్ణయించారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ‘ఈ-పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగా ప్రతి రైతుకూ ఎరువుల కోటా నిర్ణయించారు. ఈ కోటా ఎరువును అవసరాన్ని బట్టి ఒకేసారి లేదా విడతలవారీగా ఎప్పుడైనా పొందవచ్చు. గతంలో కొంతమంది రైతులు వివిధ ప్రాంతాల్లో ఎక్కువసార్లు ఎరువులు కొనడంతో చిన్న, సన్నకారు రైతులకు కొరత ఏర్పడేది. ప్రస్తుతం ఏపీ-ఏఐఎంఎస్ యాప్ అమలుతో ప్రతి రైతుకు నిర్ణయించిన కోటా మేరకే ఎరువులు అందతాయి. పారదర్శకంగా పంపిణీతో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. జిల్లాలో ఎరువుల పంపిణీపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ-పంటలో నమోదు కాని రైతులు లేదా సాంకేతిక కారణాలతో వివరాలు కనిపించకుంటే ‘రైతు సేవా కేంద్రం’ను సంప్రదిస్తే వివరాలను సరిచేసి ఎరువులు అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాకు సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే 7 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వర్షాభావంతో ప్రస్తుతం ఎరువుకు డిమాండ్ కూడా తక్కువగా ఉందన్నారు. ఇప్పటివరకు 5 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు కొన్నట్లు చెప్పారు. ముఖ్యంగా డిసెంబరు, జనవరి నెలల్లో డిమాండ్ పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో సరఫరా పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఓటీపీ లేదా బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా ఇప్పటికే 19,422 మంది రైతులు ఎరువులు పొందినట్లు తెలిపారు. భూయజమాని విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్నా, ఆయనకు వచ్చే ఓటీపీ ద్వారా కౌలు రైతులు లేదా సాగుదారులు ఎరువులు పొందే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ చెప్పారు. అవసరమైన చోట ఎరువుల కోటాను కూడా పెంచినట్లు తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ నుంచి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలుచేసే ప్రైవేటు ఎరువుల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్సులను రద్దుచేసి షోకాజ్ నోటీసులిస్తామని హెచ్చరించారు.
యాప్‌తో రైతుకు సాంకేతిక సాయం
రైతులకు మరింత సాంకేతిక సహాయం అందించేందుకు ఏపీ-ఏఐఎంఎస్ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. ఈ యాప్ ద్వారా వాతావరణ సమాచారం, వర్షపాతం అంచనాలు, ఉష్ణోగ్రత వివరాలు, నేల ఆరోగ్యం, పంట ఆరోగ్య విశ్లేషణ, ఎరువులు, పురుగుమందుల అవసరాలపై సూచనలు పొందవచ్చని చెప్పారు. పంట ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే పంట ఆరోగ్యంపై విశ్లేషణ కూడా అందుతుందని తెలిపారు. రైతులు తప్పనిసరిగా ఈ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.