తండ్రీ కొడుకులు అంతర్రాష్ట్ర దొంగలు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:34 AM
వాళ్లిద్దరూ తండ్రీ కొడుకులు. తండ్రి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. డిగ్రీ వరకు చదివిన కొడుకు ప్రైవేటు ఉద్యోగి. వీరికొచ్చే ఆదాయం చాలడం లేదని దొంగతనాలకు అలవాటు పడ్డారు.
ఆదాయం చాలలేదని దొంగతనాలు
అరెస్టు చేసిన పోలీసులు
రూ.38 లక్షల బంగారం, వెండి ఆభరణాలు సీజ్
చిత్తూరు అర్బన్, జూన్ 4(ఆంధ్రజ్యోతి): వాళ్లిద్దరూ తండ్రీ కొడుకులు. తండ్రి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. డిగ్రీ వరకు చదివిన కొడుకు ప్రైవేటు ఉద్యోగి. వీరికొచ్చే ఆదాయం చాలడం లేదని దొంగతనాలకు అలవాటు పడ్డారు. పగలంతా పట్టణాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. రాత్రి సమయాల్లో వెళ్లి ఆ ఇళ్లను చూసేవారు. అప్పుడూ తాళం వేసుంటే.. పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. ఇలా చిత్తూరులోని మిట్టూరులో చేసిన దొంగతనంపై పోలీసులు తండ్రీ కొడుకులిద్దర్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.38 లక్షల విలువ చేసే బంగారు.. వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను గురువారం పోలీసు అతిథి గృహంలో చిత్తూరు ఒకటో పట్టణ ఇన్‌చార్జి సీఐ నెట్టికంఠయ్య, ఎస్‌ఐ శివ శంకర్‌తో కలిసి డీఎస్పీ వెంకటనారాయణ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. చిత్తూరు నగరం మిట్టూరులో గౌతమ్‌కిరణ్, కుటుంబ సభ్యులు ఊరెళ్లడంతో గతనెల 24వ తేది ఇంటికి తాళం వేసి ఉంది. తాళం వేసిన ఇంటిని గుర్తించిన దుండగులు.. రాత్రి వేళ తాళాన్ని పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేర స్థలంలో లభించిన సాంకేతిక ఆధారాలను సేకరించి.. పరిశీలించగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట ముఠాగా గుర్తించారు. ఈ నేపథ్యంలో గురువారం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు చిత్తూరు నగర పరిధిలోని కట్టమంచి సమీపంలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద వేలూరు జిల్లా కాట్పాడి అరుంధతివాడకు చెందిన పెరుమాళ్ కృష్ణ(54), అతడి కుమారుడు కృష్ణ సంతో్‌షకుమార్(26)ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ దొంగతనానికి పాల్పడింది తామేనని విచారణలో అంగీకరించారు. వారి నుంచి 186 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10లక్షల విలువ చేసే 3.75 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ. 38 లక్షలుగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును తక్కువ వ్యవధిలోనే ఛేదించిన ఎస్‌ఐ శివశంకర్, ఏఎ్‌సఐ దేవరాజులు, సిబ్బందిని నగదు బహుమతితో సత్కరించారు.
నిందితులపై 20 కేసులు
చిత్తూరులో అరెస్టయిన తండ్రీ కొడుకులపై రాష్ట్రంతో పాటు కర్ణాటకలో 20 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి అర్బన్ అలిపిరి, తిరుపతి ఈస్ట్ స్టేషన్, తిరుపతి సీసీఎ్‌సలో ఒక్కోటి చొప్పున 3, కర్ణాటక రాష్ట్రంలోని మహాలక్ష్మీ లే అవుట్ పోలీసు స్టేషన్‌లో 5, కెంగేరి స్టేషన్‌లో 10, బనశంకరి స్టేషన్, హుడ్కో స్టేషన్‌లో ఒక్కోటి వంతున రెండు కేసులు నమోదయ్యాయి.