రైతులూ ఆందోళన చెందొద్దు: అచ్చెన్న
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:23 AM
తోతాపురి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంచి ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన వర్చువల్ విధానంలో సమీక్షించారు.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తోతాపురి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంచి ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన వర్చువల్ విధానంలో సమీక్షించారు. చిత్తూరు నుంచి కలెక్టర్ సుమిత్‌కుమార్, ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతక అధికారులు, గుజ్జు పరిశ్రమల యజమానులు, బాట్లింగ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 78వేల హెక్టార్లలో తోతాపురి రకం సాగవుతోందని, దీనిపై వేలాదిమంది రైతులు ఆధారపడి ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ‘జిల్లాలో సుమారు 7.80 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా 25-30 శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశమున్నా.. ఇతర రకాలతో పోలిస్తే తోతాపురి పరిస్థితి మెరుగ్గా ఉంది. జిల్లాలో 44 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లకు ఈ సీజన్‌లో 37 కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ ఫ్యాక్టరీల ప్రాసెసింగ్ సామర్థ్యం 3.50 లక్షల టన్నులు. ఇప్పటికే 20 యూనిట్లలో కార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రస్తుత మార్కెట్‌లో తోతాపురి ధర కిలో రూ.7 నుంచి రూ.7.50 మధ్య ఉంది’ అని కలెక్టర్ సుమిత్ కుమార్ మంత్రికి వివరించారు.