సీఎం ఇంటి సమీపంలో రైతు ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:59 AM
సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేసేందుకు నారావారిపల్లెకు వచ్చిన రైతు గోవిందరెడ్డి (60) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు
అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మనస్తాపం
చంద్రబాబుకు అర్జీ ఇచ్చేందుకు వచ్చి పురుగుల మందు తాగిన గోవిందరెడ్డి
తిరుపతి/పెద్దపంజాణి, జనవరి 14 (ఆంఽధ్రజ్యోతి): సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేసేందుకు నారావారిపల్లెకు వచ్చిన రైతు గోవిందరెడ్డి (60) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఈ రైతుది చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నగిరేపల్లి గ్రామం. జంపాల రామిరెడ్డి, జంపాల గోవిందరెడ్డి అన్నదమ్ములు. వీరు గతంలో రాయలపేట పంచాయతీ చెన్నారెడ్డిపల్లెలో ఉండేవారు. అక్కడి స్థిరాస్తులను సమానంగా పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట అక్క నరసమ్మ ఉండే నగరేపల్లెకు వచ్చిస్థిరపడ్డారు. ఇద్దరికీ ప్రభుత్వం ఇంటి స్థలాలతో పాటు పక్కా గృహాలు మంజూరు చేయడంతో స్లాబు స్థాయికి నిర్మించుకున్నారు. వాస్తుప్రకారం ఇల్లు లేదని, తన తమ్ముడు గోవిందరెడ్డి ఇల్లు ఇస్తే ఆ ఖర్చు కట్టిస్తానని రామిరెడ్డి చెప్పారు. ఆ ప్రకారం తమ్ముడి ఇంటినీ తన ఇంటితో కలిపి కట్టుకున్నారు. ఆ ఇంటికి డబ్బు ఇవ్వకపోవడం, చెన్నారెడ్డిపల్లె వద్ద భూముల ఆక్రమణకూ యత్నించాడంటూ గోవిందరెడ్డి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన రాజకీయ అండతో రామిరెడ్డి ఆ ఫిర్యాదులను నీరుగార్చేవాడని, పలుమార్లు పంచాయితీలో పెద్దలు చెప్పినా వినలేదని స్థానికులు అంటున్నారు. తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసిన గోవిందరెడ్డి.. ఇప్పుడు ఇల్లులేక అక్క నరసమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు బుధవారం నారావారిపల్లె వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబును కలిసి తన సమస్యను చెప్పే పరిస్థితి లేకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేశారు. దీనిని గమనించిన పోలీసులు చికిత్స కోసం నారావారిపల్లెలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయాస్పత్రికి, అక్కడ్నుంచి స్విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాల వల్ల క్షణికావేశంలో బాధితుడు పురుగులమందు తాగారని కలెక్టర్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారని, ప్రస్తుతం గోవిందరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా, రాత్రి 11 గంటల సమయంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహ్, అర్బన్ తహసీల్లారు సురే్‌షబాబు స్విమ్స్‌కు వెళ్లి బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందన్నారు.