చిత్తూరుకు వీడ్కోలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:04 AM
చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంఽధానికి పుంగనూరు వీడ్కోలు పలికి బుధవారం కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో చేరింది. వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలుగా మూడు ముక్కలైంది.
కొత్త సంవత్సరం.. కొత్త జిల్లాలోకి పుంగనూరు
పుంగనూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంఽధానికి పుంగనూరు వీడ్కోలు పలికి బుధవారం కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో చేరింది. వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలుగా మూడు ముక్కలైంది.రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లాలో చేర్చారు. పుంగనూరు నియోజకవర్గాన్ని మాత్రం పరిపాలన సౌలభ్యం కోసమంటూ చిత్తూరు జిల్లాలో కొనసాగించి పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం మండలాలను పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో, పులిచెర్ల, రొంపిచెర్లను చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు మంగళవారం రాయచోటి, పీలేరు, మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలతో మదనపల్లె జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. బుధవారం కొత్తజిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో అన్నమయ్య మదనపల్లె జిల్లాగా బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె మదనపల్లె డివిజన్‌లో, సోమల, సదుం మండలాలు పీలేరు డివిజన్‌లో, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు మాత్రం చిత్తూరు డివిజన్‌లో చేర్చారు. పుంగనూరు మున్సిపల్ కార్యాలయ బోర్డులో గతంలో ఉన్న చిత్తూరు జిల్లాను మార్చి అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసిన బోర్డును కలెక్టర్ నిశాంత్‌కుమార్, కమిషనర్ మధుసూదన రెడ్డి, తహసీల్దార్ జే.రాము తదితరులు ప్రారంభించారు. 2026వ సంవత్సరం తొలినుంచే ఇక పుంగనూరు నియోజవర్గం అన్నమయ్య మదనపల్లె జిల్లాకు స్వాగతం పలికి పూర్వమున్న చిత్తూరు జిల్లాకు వీడ్కోలు పలికింది. కాగా పుంగనూరు నియోజవర్గం మదనపల్లెలో చేరడంపై ఎన్డీఏ కూటమి నాయకులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.