లక్ష్యానికి దూరంగా..!
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:54 AM
నగరం, పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలు 54శాతమే నీటి పన్ను మరింత దారుణం 14 రోజుల్లో రూ.25.77 కోట్ల బకాయిల వసూళ్లు సాధ్యమేనా?
చిత్తూరు అర్బన్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో ఆస్తి, కొళాయి పన్ను బిల్లుల వసూళ్లు లక్ష్యానికి దూరంగా ఉండిపోయాయి. జిల్లాలోని ఒక నగరపాలక సంస్థలో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను 54 శాతమే వసూలైంది. కొళాయి బిల్లుల వసూళ్లలో పలమనేరు 54, పుంగనూరు 45 శాతం వసూళ్లు కాగా.. మిగిలిన చోట్ల 26 శాతం దాటలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మిగిలిందిక 14 రోజులు మాత్రమే. ఈలోపు ఆస్తిపన్ను.. నీటి పన్ను లక్ష్యాలను పూర్తి చేయాలని బిల్లు కలెక్టర్ల నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు అసె్‌సమెంట్లదారుల ఇళ్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 43,794 అసె్‌సమెంట్లు ఉన్నాయి. పుంగనూరులో 12,993, పలమనేరులో 12,811, కుప్పంలో 12,535, నగరిలో 14,336 అసె్‌సమెంట్లతో కలిపి మొత్తం 96,469 అసె్‌సమెంట్లు ఉన్నాయి. ఆస్తి పన్నుల వసూళ్లు వంద శాతం లక్ష్యం పూర్తి చేస్తేనే 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయని తెలియడంతో ఇటు అధికారులు, అటు పాలకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బకాయిలు రూ.కోట్లలో ఉండటంతో వేగాన్ని పెంచాలని కమిషనర్ కింది స్థాయి అధికారులు, సిబ్బందికి ఆదేశాలిస్తున్నారు.
డిఫాల్టర్ల జాబితా సిద్ధం
చిత్తూరు నరగపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల్లో కొన్నేళ్ల నుంచి బిల్లులు చెల్లించని వారి జాబితాను సిద్ధం చేశారు. డిఫాల్టర్ల వద్దకు బిల్ కలెక్టర్ల నుంచి సచివాలయ ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోనే ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య సముదాయాలతో కలిపి వంద మంది జాబితాను సిద్ధం చేసి నోటీసులు ఇచ్చారు. ఈ జాబితాలో విజయా డెయిరీ రూ.3 కోట్లు, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ రూ.3.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు 40 శాతం ఉండగా.. హోటళ్లు, పలు వాణిజ్య సముదాయాలకు సంబంఽధించి 2004 నుంచి ఇప్పటి వరకు చెల్లించనివారు ఉన్నారు. పెండింగ్ బిల్లుల చిట్టా చూపించి చెల్లించమని అధికారులు ప్రాధేయపడుతున్నారు.
నీటి బిల్లుల వసూళ్లలో మరీ అధ్వానం
చిత్తూరు నగరపాలక కార్యాలయంలో పాటు మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో నీటి బిల్లుల వసూళ్లు మరీ అధ్వానంగా ఉంది. ఈ నెల 17వ తేదీనాటికి అధికారులు, సిబ్బంది వసూళ్లు చేసిన బిల్లుల్లో ఒక్క పలమనేరు మాత్రమే 54 శాతం, పుంగనూరు 45శాతం వసూళ్లు చేయగా మిగిలిన మున్సిపాలిటీలు 22 నుంచి 26 శాతం దాటలేదు. చిత్తూరులో 25వేల అసె్‌సమెంట్లకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.10.38కోట్ల వసూళ్లకు గాను రూ.2.53 కోట్లు వసూలు చేశారు. నగరిలో రూ.2.28 కోట్లకు గాను రూ.60లక్షలు, కుప్పంలో 1.22 కోట్లకు గాను రూ.27లక్షలు, పలమనేరు రూ.1.52 కోట్లకు రూ.82లక్షలు, పుంగనూరు రూ.2.09 కోట్లకుగాను రూ.94 లక్షలు వసూలు చేశారు.
నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీమాఫీ
చిత్తూరు నగరపాలక పరిధిలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 వరకు ఆస్తి, ఖాళీస్థలాల పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీలోపు ఒకేసారి చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీ లభిస్తుంది. ఈ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలి.
- నరసింహ ప్రసాద్, కమిషనర్, చిత్తూరు నగరపాలక సంస్థ