Share News

నకిలీ బంగారు ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:22 AM

నకిలీ బంగారు విక్రయించే ముఠా గుట్టును మదనపల్లె టూటౌన్‌ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆ వివరాలను డీఎస్పీ పావని మీడియాకు వెల్లడించారు.

నకిలీ బంగారు ముఠా గుట్టురట్టు
19ఎంపీఎల్‌సీ1: వాహనం సహా నిందితులను అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు

ఏడుగురు నిందితుల అరెస్ట్‌

వాహనం సహా మూడు కిలోల నకిలీ నగల స్వాధీనం

మదనపల్లె క్రైం, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి) : నకిలీ బంగారు విక్రయించే ముఠా గుట్టును మదనపల్లె టూటౌన్‌ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆ వివరాలను డీఎస్పీ పావని మీడియాకు వెల్లడించారు. పుంగనూరు మండలం పాళెంపల్లె పంచాయతీ జైనగర్‌కాలనీకి చెందిన ఆర్‌.చరణ్‌, అతని బంధువులు ఎం.వినోద్‌కుమార్‌, ఎం.రూక్‌జాన్‌ అలియాస్‌ రూప్జన్‌, ఆర్‌.పండి, వీరబల్లి మండలం తాటిగుంటపల్లె పంచాయతీ షికారీపాళెంకు చెందిన ఆర్‌.మల్లన్న, ఎస్‌.చలపతి, ఆర్‌.కృష్ణబాబు గ్రామాల్లో పూసలు, ప్లాస్టిక్‌ పూలదండల వ్యాపారం చేస్తుండేవారు. విలాసాలకు అలవాటుపడిన వీరంతా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తక్కువ ధరకే బంగారు ఇస్తామని ఆశచూపి జనాలను మోసం చేయడం ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్‌కు ఫోన్‌ చేసి, డబ్బు అత్యవసరం కావడంతో కిలో బంగారు రూ.7లక్షలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. అతను తమ బంధువులైన మరో ముగ్గురిని వెంట తీసుకుని ఈ నెల 17న మదనపల్లెలోని అన్నమయ్య సర్కిల్‌కు వచ్చాడు. నిందితులు 2,800 గ్రాముల నకిలీ బంగారు పూసలదండ తీసుకుని కారులో సర్కిల్‌కు వచ్చారు. వెంకటేష్‌కు దాన్ని చూపించారు. ఇది నకిలీ బంగారమంటూ అతడు తిరగబడటంతో కత్తులతో బెదిరించి చొక్కాజేబులో ఉన్న రూ.5వేలు లాక్కొన్నారు. దీంతో బాధితుడు టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. నిందితులు పోలీసులను చూసి కారులో పారిపోతుండగా వెంబడించి రామసముద్రం సమీపంలో పట్టుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారించగా గుట్టు రట్టయింది. శుక్రవారం ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, రిమాండుకు తరలించారు. రూ.40లక్షలు విలువ చేసే నకిలీ పూసలదండ, కారు, మూడు కత్తులను సీజ్‌ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కాగా పండిపై మదనపల్లె తాలూకా, వీరబల్లి పోలీస్‌స్టేషన్లలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసు ఛేదనకు కృషి చేసిన టూటౌన్‌ సీఐ మహ్మద్‌రఫీ, ఎస్‌ఐ రామాంజనేయులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

=================================================

Updated Date - Jun 20 , 2026 | 02:22 AM