నకిలీ డ్రిప్ ఎరువుల ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - May 27 , 2026 | 01:00 AM
టమోటా పంటకు వినియోగించే డ్రిప్ ఎరువులను కొందరు మోసగాళ్లు ప్రముఖ కంపెనీ పేరుతో దుకాణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకున్న సంఘటన వెలుగులో చూసింది.
వాలాగ్రా కంపెనీ పేరుతో విక్రయాలు
రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్న వ్యాపారులు
సోమల, మే 26 (ఆంధ్రజ్యోతి): టమోటా పంటకు వినియోగించే డ్రిప్ ఎరువులను కొందరు మోసగాళ్లు ప్రముఖ కంపెనీ పేరుతో దుకాణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకున్న సంఘటన వెలుగులో చూసింది. ప్రస్తుతం టమోటా సీజన్‌లో రైతులు డ్రిప్ ఎరువులను తమ పంటలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కందూరులోని రమేశ్ కార్నర్ షాపులో నకిలీ డ్రిప్ ఎరువుల విక్రయాలు జరుగుతున్నట్లు రైతులు గుర్తించారు. 25 కిలోల డ్రిప్ ఎరువు బస్తాను సోమల పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. నకిలీ ఎరువులతో మోసపోయిన రైతులు అధికసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మండలంలో పలు దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నారంటూ వాపోయారు. న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. ఉప్పు, యూరియా, అమ్మోనియం సల్ఫేట్, ఎరుపు రంగు వచ్చేలా రసాయనాలు కలిపి తమకు విక్రయించినట్లు తెలిపారు. వాలాగ్రా కంపెనీ బ్రాండ్‌తో 25కిలోల బస్తా రూ.10వేలకు విక్రయించినట్టు చెప్పారు. సోమల ఏవో సుధాకర్ స్టేషన్ వద్దకు చేరుకుని రైతులు తెచ్చిన డ్రిప్ ఎరువుల బస్తాలను పరిశీలించారు. వాటిని శాంపుల్ తీసుకుని ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. పుంగనూరు రూరల్ సీఐ సాయిప్రసాద్ స్టేషన్‌కు చేరుకుని రైతులతో మాట్లాడి నకిలీ ఎరువుల విక్రయాలపై దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులతో కలసి ఏవో సుధాకర్ ఎరువుల దుకాణాల్లో స్టాక్‌ను పరిశీలించారు. సోమల, నెల్లిమంద, ఇరికిపెంట, కందూరు, మేటిమంద, నంజంపేట, గన్నావారిపల్లె ప్రాంత రైతులు పాల్గొన్నారు.