Share News

మమ్ము కరుణించు గంగమ్మ తల్లో

ABN , Publish Date - May 13 , 2026 | 12:12 AM

మంగళవారం చిత్తూరు నడివీధి గంగమ్మను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు.

మమ్ము కరుణించు గంగమ్మ తల్లో
భక్తులకు నిజరూపదర్శనమిస్తున్న గంగమ్మ

చిత్తూరు కల్చరల్‌, మే12 (ఆంధ్రజ్యోతి): ‘కరుణించు మాతల్లీ గంగమ్మ.. నీకు కోటి దండాలు’ అంటూ భక్తులు మంగళవారం చిత్తూరు నడివీధి గంగమ్మను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. నడివీధి గంగజాతర వేకువజామున మొదలైంది. తొలుత అమ్మవారికి సారెను జాతర వంశపారంపర్య ధర్మకర్తలు సీకే బాబు దంపతులు పొన్నియమ్మ గుడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. తొలి పూజలు నిర్వహించారు. అమ్మవారి ముసుగు తొలగించి భక్తులకు దర్శనం కల్పించారు. అదేసమయంలో కొందరు భక్తులు మేకలు, పొట్టేలు, కోళ్లను అమ్మవారికి బలులిచ్చి.. ఆ రక్తాన్ని చల్లారు. అనంతరం భక్తుల సమక్షంలో సీకే బాబు దంపతులు అమ్మవారి మంగల్యాన్ని సమర్పించి.. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అప్పట్నుంచి భక్తులు వేలాదిగా అంబలి బిందెలను నెత్తిన పెట్టుకుని.. వేపాకు చుట్టుకుని నడివీధి గంగమ్మ దర్శనానికి వచ్చారు. అంబలి నైవేద్యాన్ని సమర్పించారు. ప్రత్యేక బెల్లం పాగు పెనాలలో నింపిన అంబలిని నిర్వాహకులు భక్తులకు పంపిణీ చేశారు. మిగిలిన అంబలిని పరిసర మండలాల రైతులు ఎప్పటి కప్పుడు బిందెలతో తీసుకెళ్లి తమ పొలాల్లో చల్లారు. ఈ ఏడాది పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ దంపతులు, చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. చిత్తూరు జైన్‌ సంఘం నాయకులు భక్తులకు మజ్జిగ, తాగునీరు, పండ్ల రసాలను పంపిణీ చేశారు. పలువురు దాతలూ అన్నప్రసాద వితరణ చేశారు. ఇక, సంతపేట, దొడ్డిపల్లె, మురకంబట్టు, కొంగారెడ్డిపల్లె, గిరింపేట, మంగసముద్రం హౌసింగ్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీలోనూ అమ్మవార్లను కొలువుదీర్చి.. జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరులోని వీధులన్నీ వేపాకు తోరణాలతో కళకళలాడాయి.

Updated Date - May 13 , 2026 | 12:12 AM