Share News

పదోన్నతి పరీక్షలో ఫెయిల్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:58 AM

పదోన్నతి వచ్చింది. కానీ, నిర్ణీత రెండేళ్లు.. ఆపై మరింత గడువు తీసుకున్నా డిపార్టుమెంటల్‌ పరీక్షల్లో పాస్‌ కాలేకపోయారు. ఆ పదోన్నతులను నిలబెట్టుకోలేక పోయారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 19 మందికి సీనియర్‌ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్‌-1 వీఆర్వోలుగా డిమోషన్‌ వచ్చింది.

పదోన్నతి పరీక్షలో ఫెయిల్‌

ఉమ్మడి జిల్లాలో 19 మంది ఉద్యోగులకు డిమోషన్‌

సీనియర్‌ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్‌-1 వీఆర్వోలుగా వెనక్కి

పదోన్నతి వచ్చింది. కానీ, నిర్ణీత రెండేళ్లు.. ఆపై మరింత గడువు తీసుకున్నా డిపార్టుమెంటల్‌ పరీక్షల్లో పాస్‌ కాలేకపోయారు. ఆ పదోన్నతులను నిలబెట్టుకోలేక పోయారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 19 మందికి సీనియర్‌ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్‌-1 వీఆర్వోలుగా డిమోషన్‌ వచ్చింది.

- మదనపల్లె, ఆంధ్రజ్యోతి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, చిత్తూరు, తిరుపతి ఏరియాలలో గ్రేడ్‌-1 వీఆర్వోలుగా పనిచేస్తున్న 48 మందికి ప్రభుత్వం సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది. వీరంతా మొదటగా 2022 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2023 అక్టోబరు 11వతేదీ వరకూ సీనియర్‌ అసిస్టెంట్లుగా చేరారు. ఆ పదోన్నతి నిలబెట్టుకోవాలంటే రెండేళ్లలో ప్రభుత్వం నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాస్‌ కావాలి. రెవెన్యూ సర్వీసెస్‌-3, డిపార్ట్‌మెంట్‌, జీవోనంబర్‌:154, ప్రకారం ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు కచ్చితంగా పాస్‌ కావాలి. వీఆర్వో గ్రేడ్‌-1 నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందిన వారు మొదటి రెండేళ్లు తప్పని సరిగా, తహసీల్దార్‌ కార్యాలయం లేదా ఆర్డీవో కార్యాలయం లేదా కలెక్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేయాలన్నది నిబంధన. లేకుంటే వీరంతా క్షేత్రస్థాయిలో ఆర్‌ఐగా పని చేసే అవకాశం లేదు. అలాగే రెవెన్యూ టెస్టు-1, 2, 3, అకౌంట్‌ టెస్టు, 42 రోజుల సర్వేట్రైనింగ్‌, సర్వే పరీక్ష, ఏపీ కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ, ఆటోమేషన్‌ పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలి. రెండేళ్ల నుంచి నాలుగేళ్లు కావస్తున్నా.. వీరిలో కొందరు ఆ పరీక్షలు పాస్‌కాలేదు.

షోకాజ్‌ నోటీసులిచ్చినా..

‘మీరంతా సీనియర్‌ అసిస్టెంట్లుగా పదవీకాలం పూర్తి చేసినా, డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు పాస్‌ కాలేదు. మిమ్మల్ని తిరిగి వీఆర్‌వ్వోలుగా ఎందుకు రివర్షన్‌ ఇవ్వకూడదో చెప్పండి’ అంటూ 2024 జూలైలో పది మందికి అప్పటి కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆ షోకాజ్‌ నోటీసు అందుకున్న పదిమంది జాబితాలో ప్రస్తుతం మదనపల్లె ఆర్‌ఐ ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం, కురబలకోట ఆర్‌ఐగా పనిచేస్తున్న శేషాద్రిరావు, కె.వి.పల్లె మండలంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న జి.వెంకటరమణ ఉన్నారు. అప్పట్లో షోకాజ్‌ నోటీసులతో గుర్తుచేసినా ఫలితం లేకపోయింది. దీంతో చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఉమ్మడి జిల్లా నోడల్‌ అధికారి అయిన సుమిత్‌కుమార్‌ పరీక్ష పాస్‌ కాని 19 మందికి రివర్షన్‌ ఇచ్చారు. తిరిగి వారిని గ్రేడ్‌-1 వీఆర్వోలుగా డిమోషన్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు(ఆర్‌ఐ)గా పనిచేస్తున్న వారూ ఉన్నారు. వీరంతా డిమోషన్‌ కింద పోస్టింగ్‌ కోసం కలెక్టరేట్‌ను సంప్రదించాలని సూచించారు.

రివర్షన్‌ వచ్చింది వీరికే

డిమోషన్‌ అయిన వారిలో.. పి.శివకుమారి (గంగవరం), సి.శేషాద్రిరావు (కురబలకోట), ఎం.రెడ్డెప్ప (రామసముద్రం), సి.నాగరాజురెడ్డి (బి.ఎన్‌.కండ్రిగ), జి.రమేష్‌ (నిమ్మనపల్లె), జి.వెంకటరమణ (కె.వి.పల్లె), కె.చంద్రశేఖర్‌ (ములకలచెరువు), పి.సురేష్‌ (సత్యవేడు), ఎన్‌.వెంకటేశ్వరయ్య (పీలేరు), ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం (మదనపల్లె), బి.రెడ్డెప్ప (మదనపల్లె), జి.గురుస్వామి (శ్రీకాహస్తి), బి.చిన్నరెడ్డెప్ప (పీటీఎం), వి.కరుణాకర్‌ (శ్రీకాళహస్తి), పి.ప్రభాకర్‌ (నిండ్ర), కె.ఎం.భాస్కర్‌ (తవణంపల్లె), డి.ఎన్‌.జయసింహ (తిరుపతి), ఎం.రమేష్‌ (కుప్పం), వి.నారాయణ (కుప్పం) ఉన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 01:58 AM