Share News

మేయర్‌ పదవిపై కన్ను

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:36 AM

రాష్ట్రంలోనే అత్యంత కీలక నగరమైన తిరుపతి మేయర్‌ పదవిపై పలువురు ఆశలు పెంచుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపధ్యంలో రాజకీయవర్గాల్లో అపుడే అంచనాలు మొదలయ్యాయి. మేయర్‌ పదవి ఏ కేటగిరీకి రిజర్వయితే ఎవరికి అవకాశాలుంటాయి? ఎవరెవరు రేసులో వుంటారు? అన్నదానిపై నగరంలోనూ చర్చ మొదలైంది.

మేయర్‌ పదవిపై కన్ను

ఆశలు... అంచనాల్లో కూటమి పార్టీల నాయకులు

రాష్ట్రంలోనే అత్యంత కీలక నగరమైన తిరుపతి మేయర్‌ పదవిపై పలువురు ఆశలు పెంచుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపధ్యంలో రాజకీయవర్గాల్లో అపుడే అంచనాలు మొదలయ్యాయి. మేయర్‌ పదవి ఏ కేటగిరీకి రిజర్వయితే ఎవరికి అవకాశాలుంటాయి? ఎవరెవరు రేసులో వుంటారు? అన్నదానిపై నగరంలోనూ చర్చ మొదలైంది.

తిరుపతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తిరుపతికి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కావడాన దేశవిదేశాల నుంచీ సైతం నిత్యం వీవీఐపీలు వస్తుంటారు. వారికి స్వాగత, వీడ్కోలు సందర్భంగా మేయర్‌కు ప్రాధాన్యత వుంటుంది. ప్రోటోకాల్‌ పరంగా లభించే ఈ గుర్తింపే తిరుపతి మేయర్‌ పదవికి క్రేజ్‌ సృష్టిస్తోంది. దానికితోడు తిరుపతి కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగానూ, పారిశ్రామికంగానూ కూడా కీలక నగరంగా ఆవిర్భవిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన మూడు ఎకనమిక్‌ రీజియన్లలో తిరుపతి కూడా ఒకటి. తిరుపతి కేంద్రంగా భారీ ఎత్తున అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటన్నింటి దృష్య్టా మేయర్‌ పదవి కీలకంగా మారుతోంది. పర్యవసానంగా అధికార పార్టీలో పలువురు ఆశావహులు ఈ పదవిపై కన్నేశారు. అధికారంలో వున్నందున కొంతమేరకు ఆర్థిక వనరులు ఖర్చు చేసుకుంటే చాలు సునాయాసంగా గెలుస్తామన్న ధీమా కూడా దీనికి తోడవుతోంది. అదే సమయంలో కూటమి పార్టీలలో ఒకటైన బీజేపీ నుంచీ ఆశావహులు ఈ పదవిపై దృష్టి సారిస్తున్నారు.

టీడీపీలో పోటీదారులెక్కువే

తిరుపతి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో బలిజ, బీసీ, రెడ్డి, కమ్మ వర్గాలకు ప్రాధాన్యత వుంటూ వస్తోంది. జనరల్‌ లేదా జనరల్‌ మహిళ కేటగిరీకి రిజర్వు అయిన పక్షంలో ముందుగా పరిగణనలోకి తీసుకునేది బలిజ సామాజికవర్గాన్ని. టీడీపీ ఇంఛార్జి జేబీ శ్రీనివా్‌స,మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కీర్తి,రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం మేయర్‌ రేసులో వుండే అవకాశముంది.అయితే ఇప్పటికే ఆ వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా వున్నందున మేయర్‌ పదవి కూడా వారికే కేటాయిస్తారా అన్నది ప్రశ్న. మేయర్‌ పదవి జనరల్‌ అయినా కూడా టీడీపీ అధిష్ఠానం బీసీలకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అలా చూస్తే యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌ తన కుటుంబ సభ్యులకు ఆశించే పరిస్థితి వుంటుంది.మరో సీనియర్‌ నేత దంపూరి భాస్కర్‌ యాదవ్‌ ఆర్థికంగా బలంగా వుండడంతో పాటు సొంత సామాజికవర్గంలో కొంత పట్టు కలిగివున్నారు. అలాగే బీజీ కృష్ణయాదవ్‌, తెలుగు మహిళ జిల్లా మాజీ అధ్యక్షురాలు పుష్పావతి యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత వంటి వారు కూడా రేసులో వుండే అవకాశముంది. రెడ్డి సామాజికవర్గం విషయానికొస్తే ఇప్పటికే తుడా ఛైర్మన్‌గా దివాకర రెడ్డి కొనసాగుతున్నందున ఆ వర్గానికి మళ్ళీ అవకాశం వుంటుందా అన్నది ప్రశ్న. ఒకవేళ అధిష్ఠానం ఛాన్సు ఇస్తే మాత్రం మబ్బు దేవనారాయణరెడ్డి ముందు వరుసలో వుంటారు.నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు, సామాజికవర్గంపై కొంత పట్టుండడం వంటివి ఆయనకు కలిసొచ్చే అంశాలు. కమ్మ సామాజికవర్గంలో మాజీ డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ ఒక్కరే ప్రధాన స్రవంతి రాజకీయాల్లో వున్నారు. ఆయన గతంలో తిరుపతి నగర టీడీపీ అధ్యక్షుడిగా, తాతయ్యగుంట గంగమ్మ గుడి ఛైర్మన్‌గా పనిచేశారు.గత మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ నుంచీ ఏకైక కార్పొరేటర్‌గా గెలిచి పార్టీ ఉనికి కాపాడారు.

బీజేపీ, జనసేన నుంచి కూడా

టీడీపీ కూటమిలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ నుంచీ కూడా ఈ పర్యాయం మేయర్‌ పదవికి పోటీ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో ముఖ్య నేతగా వున్న భానుప్రకా్‌షరెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది నవంబరులో ఆ పదవికి గడువు ముగియనుంది. ఇంచుమించు అదే నెలలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆయనకు పార్టీలో వున్న పరిచయాలు, పలుకుబడి దృష్ట్యా మేయర్‌ పదవిని తనకు గానీ లేదా తన సతీమణికి గానీ ఆశించే అవకాశముంది. మరోవైపు అదే పార్టీలో జిల్లా నేతగా వున్న సామంచి శ్రీనివాస్‌ కూడా మేయర్‌ పదవిని కోరేందుకు ఆస్కారముంది. జనసేన తరపున గేట్‌ వెంకటేశ్వర్లు, సుభాషిణి విన్పిస్తున్నాయి.ఇప్పటికైతే రిజర్వేషన్‌ ఖరారు కాలేదు కాబట్టి అన్ని ప్రధాన సామాజిక వర్గాల నుంచీ ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మేయర్‌ పదవి సంగతి పక్కన పెడితే ఈ పర్యాయం తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో డివిజన్ల సంఖ్య 66కు పెరగనుంది. దీంతో కార్పొరేటర్‌ స్థానాల కోసం కూడా కూటమి భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జనసేన కూడా గట్టిగా డిమాండ్‌ చేసే పరిస్థితి వుంది.

Updated Date - Sep 01 , 2026 | 01:36 AM