Share News

టపాకాయల గోడౌన్‌లో పేలుడు

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:20 AM

టపాకాయలు నిల్వ ఉంచిన రేకుల షెడ్డులో నుంచి మంటలు ఎగసిపడ్డాయి.

టపాకాయల గోడౌన్‌లో పేలుడు
మంటలను అర్పుతున్న అగ్ని మాపక సిబ్బంది

బంగారుపాళ్యం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఢాం.. ఢాం.. అంటూ గోడౌన్‌లోని టపాకాయల పేలుడు మొదలైంది. రెండు గంటలపాటు మోతెక్కించింది. టపాకాయలు నిల్వ ఉంచిన రేకుల షెడ్డులో నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ఈ పరిణామంతో సమీపంలోని జాతీయ రహదారిపై వాహనచోదకులు భీతిల్లారు. స్థానికులు పరుగు తీశారు. ఓ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం సాయంత్రం బంగారుపాళ్యం మండలం సంక్రాంతిపల్లె సమీపాన జరిగింది.

సంక్రాంతిపల్లెకు చెందిన అమరావతి పేరిట టపాకాయల అమ్మకాలకు అధికారులు లైసెన్సు మంజూరు చేశారు. నిబంధనల మేరకు నివాసప్రాంతాలకు దూరంగా గోడౌన్‌ను ఏర్పాటుచేసి అమ్మకాలు చేపట్టాలి. దీనికి విరద్ధంగా అమరావతి కుటుంబీకులు.. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని.. నివాస స్థలాలకు మధ్యన టపాకాయల నిల్వకు ఓ రేకుల షెడ్డును ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఈ గోడౌన్‌లో మరమ్మతుల కోసం వెల్డింగ్‌ చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు పడి టపాకాయలు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మంటలు చెలరేగి పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. దట్టంగా పొగ వ్యాపించడంతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. డిస్కం అధికారులు కరెంటు సరఫరా నిలిపేశారు. జాతీయ రహదారికి పది అడుగుల దూరంలోనే మంటలు ఎగసి పడటంతో భయాందోళనతో వాహనాలను ఆపేశారు. దీంతో గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా అగ్నిమాపక అధికారి కరుణాకర్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రెండు గంటలపాటు టపాకాయలు పేలడంతో.. రూ.పది లక్షల వరకు సరుకు ఉండుంటుందని భావిస్తున్నారు. తహసీల్దారు షబ్బీర్‌బాషా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ‘నిబంధనలకు విరుద్ధంగా నేషనల్‌ హైవేకి పక్కనే, నివాస స్థలాల మధ్యనే టపాకాయలు విక్రయించడం నేరం. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. నిబంధనల విరుద్ధంగా గోడౌన్‌ ఏర్పాటు చేసుకుని, రోజూ టపాకాయలు విక్రయిస్తున్నా రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారుల్లో స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Oct 13 , 2026 | 12:20 AM