Share News

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అరుదైన ఖనిజాల అన్వేషణ

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:32 AM

తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో అరుదైన ఖనిజ నిక్షేపాల అన్వేషణకు మైనింగ్‌ దిగ్గజం కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.‘ఒంటిల్లు- చంద్రగిరి మినరల్‌ బ్లాక్‌’లో భాగంగా చిత్తూరు జిల్లా పరిధిలోని వెదురుకుప్పం, పెనుమూరు మండలాలు.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల మండలాల్లో అన్వేషణ సాగనుంది.

 తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అరుదైన ఖనిజాల అన్వేషణ

209.62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనకు అనుమతి

చిత్తూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో అరుదైన ఖనిజ నిక్షేపాల అన్వేషణకు మైనింగ్‌ దిగ్గజం కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.‘ఒంటిల్లు- చంద్రగిరి మినరల్‌ బ్లాక్‌’లో భాగంగా చిత్తూరు జిల్లా పరిధిలోని వెదురుకుప్పం, పెనుమూరు మండలాలు.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల మండలాల్లో అన్వేషణ సాగనుంది. మొత్తం ఒంటిల్లు- చంద్రగిరి అన్వేషణ బ్లాక్‌ 209.62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ బ్లాక్‌కు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రిఫర్డ్‌ బిడ్డర్‌గా ఎంపికైంది. 2025 ఆగస్టు 13న నిర్వహించిన ఈ-వేలంలో కోల్‌ ఇండియా 0.05 శాతం తుది ధర ఆఫర్‌తో ప్రిఫర్డ్‌ బిడ్డర్‌గా నిలిచింది.రాష్ట్రప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు మూడేళ్లకు ఎక్స్‌ప్లోరేషన్‌ లైసెన్సు మంజూరైంది. అయితే అన్వేషణ కార్యకలాపాలను ప్రారంభించే ముందు వర్తించే చట్టాల ప్రకారం అవసరమైన అన్ని చట్టబద్ధ అనుమతులు, ఆమోదాలు, పర్మిట్లు, అటవీ- పర్యావరణ తదితర క్లియరెన్సులు పొందాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తిరుపతి డివిజన్‌ అటవీ ప్రాంతంలో సుమారు 12,245.77 హెక్టార్లలో ప్రాథమిక సర్వే నిర్వహించడానికి డిస్ర్టిక్ట్‌ ఫారెస్టు ఆఫీసర్‌, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి ఒక సంవత్సర కాలానికి అనుమతులు లభించాయి.

Updated Date - Sep 12 , 2026 | 01:32 AM