సంతానం పేరిట నిలువు దోపిడీ
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:35 AM
చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ ఆలయంలో అమ్మవారి ఎదుట వరపడతారు. ఆకుపసరు, అమ్మవారికి అభిషేకాలు, శాంతి హోమాలు, వడిబియ్యం పేరుతో అర్చకులు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.
ఆకు పసరుకు రూ.వెయ్యి నుంచి 3వేలు
గుర్రంకొండ, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ ఆలయం సంతానలక్ష్మిగా ప్రసిద్ధిచెందింది. సంతానం లేని మహిళలు వరపడితే సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ క్రమంలో ప్రతి ఆదివారమూ వేలాది మంది మహిళా భక్తులు అమ్మవారి ఎదుట వరపడతారు. అర్చకులు ఇచ్చే ఆకు పసురు తాగి ఆలయం వద్ద ఉన్న కోనేట్లో మునిగి తడిబట్టలతో ఆలయంలో అమ్మవారి ఎదుట వరపడతారు. ఆకుపసరు, అమ్మవారికి అభిషేకాలు, శాంతి హోమాలు, వడిబియ్యం పేరుతో అర్చకులు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.
రూ.300 మాత్రమే ఇవ్వాలి
సంతానం కోసం ఆకుపసురును తాగే మహిళలు అర్చకులకు కేవలం రూ.300 మాత్రమే చెల్లించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయించాం. ఇదే విషయాన్ని అర్చకులకు కూడా పదేపదే చెబుతున్నాం. భక్తుల నుంచి కొందరు అర్చకులు వడి బియ్యం, ఆకు పసురుకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికీ వచ్చింది. అమ్మవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించే అర్చకులపై చర్యలు తీసుకుంటాం.
- లంకిపల్లె రాజన్ననాయుడు, చైర్మన్, రెడ్డెమ్మకొండ ఆలయం