ఖరీదైన భూములు ప్రభుత్వపరం
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:16 AM
తిరుపతి అభివృద్ధికి అడ్డుగా మారిన భూ వివాదాల పరిష్కార విషయంలో జిల్లా యంత్రాంగం వేగంగా స్పందిస్తోంది. కలెక్టర్ చొరవతో శెట్టిపల్లెలో 379 ఎకరాలు, దామినేడులో 80 ఎకరాల ఖరీదైన భూములు ప్రభుత్వ పరమయ్యాయి.
-జిల్లా యంత్రాంగం చొరవతో శెట్టిపల్లెలో
379 ఎకరాలు... దామినేడులో 80 ఎకరాలు
-కీలక సంస్థలు, ప్రజావసరాలకు కేటాయింపు
-పుంజుకోనున్న రియల్ ఎస్టేట్, పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలు
తిరుపతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతి అభివృద్ధికి అడ్డుగా మారిన భూ వివాదాల పరిష్కార విషయంలో జిల్లా యంత్రాంగం వేగంగా స్పందిస్తోంది. కలెక్టర్ చొరవతో శెట్టిపల్లెలో 379 ఎకరాలు, దామినేడులో 80 ఎకరాల ఖరీదైన భూములు ప్రభుత్వ పరమయ్యాయి. వాటిని కీలక సంస్థలకు, ప్రభుత్వ, ప్రజల అవసరాలకు కేటాయిస్తున్నారు. ఫలితంగా తిరుపతి చుట్టూ రియల్ ఎస్టేట్, పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి.
శెట్టిపల్లి భూముల సమస్యకు వినూత్న పరిష్కారం
తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లె ఎస్టేట్ గ్రామం. భూముల సెటిల్‌మెంట్ జరగనందున వ్యవసాయ భూములు, ఇళ్ళు, స్థలాలపై గ్రామస్తులకు హక్కులు లేవు. అమ్మకాలకు, కొనుగోళ్లకు చట్టబద్ధత లేదు. గతంలో విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు జరిగి భూములు, స్థలాలు చేతులు మారాయి. అక్రమ లే అవుట్లు, అనుమతి లేని నిర్మాణాలూ జరిగాయి. తర్వాత ప్రభుత్వం మేల్కొని రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. అప్పటికే కోర్టుల్లో కేసులూ పెరిగాయి. హైకోర్టులో 47, కమిషనర్ ఆఫ్ అప్పీల్స్ ఎదుట 9, డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్‌మెంట్స్ వద్ద 16 కేసులు పెండింగులో వున్నాయి. దీంతో శెట్టిపల్లె భూములు తిరుపతి నగర విస్తరణకు, అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. కలెక్టర్ వెంకటేశ్వర్ దీనిపై దృష్టి సారించి భూములు, స్థలాల యజమానులను ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు ఒప్పించారు. సీఎం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ ఆమోదాన్నీ పొందారు. భూమి స్వాధీనం చేసుకుని, అభివృద్ధి చేసిన తర్వాత వ్యవసాయ భూమి అయితే 30 శాతం, స్థలాలైతే 50 శాతం చొప్పున సొంతదార్లకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు కేసులు మినహా మిగిలిన కేసులన్నీ పరిష్కరించారు. శెట్టిపల్లె భూముల్లో గ్రామంతో పాటు రైల్వే క్యారేజీ రిపేర్ షాపు, చెరువు, స్మశానం వంటివి పోనూ మిగిలిన 379 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో 65 ఎకరాలు తుడాకు, 90 ఎకరాలు ప్రభుత్వానికి కేటాయించింది. మిగతా 223.60 ఎకరాలలో శెట్టిపల్లె భూముల అనుభవదారులకు 2111 ఇళ్ళ స్థలాలు కేటాయించింది. తుడా తనకు కేటాయించిన 65 ఎకరాల్లో లే అవుట్ వేసి స్థలాలను విక్రయిస్తుంది. వచ్చే ఆదాయంతో 223 ఎకరాల లే అవుట్‌ను అభివృద్ధి చేసి అనుభవదారులకు కేటాయిస్తుంది. తన ఆధీనంలోని 90 ఎకరాలను ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా స్టార్ హోటళ్ళు, కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్ల కోసం కేటాయించనుంది. శెట్టిపల్లె లే అవుట్ 223 ఎకరాల విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 1560 కోట్లు. తుడా, ప్రభుత్వ ఆధీనంలోని 155 ఎకరాల విలువ రూ. వెయ్యి కోట్లు. ఈ భూములకు చట్టబద్ధత రావడంతో ఇంతవరకూ స్తబ్దుగా వున్న ఆ ప్రాంతంలో రియల్‌ఎస్టేట్ పుంజుకోనుంది. దాంతో ఆ ఒక్క చోటే రూ. 3-4 వేల కోట్ల వరకూ ఆర్థిక కార్యకలాపాల విలువ పెరగనుంది. శెట్టిపల్లె దిశగా ఇప్పటి వరకూ జరగని తిరుపతి నగర విస్తరణ ఇకపై జోరందుకోనుంది.
దామినేడులో రూ. వెయ్యి కోట్ల విలువైన భూముల స్వాధీనం
తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద పూతలపట్ట్టు-నాయుడుపేట సిక్స్ లేన్ జాతీయ రహదారికి, కలెక్టరేట్‌కు సమీపంలో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. వీటిపై దృష్టి పెట్టిన కలెక్టర్ కేసుల పరిష్కారానికి కృషి చేశారు. దాంతో 80 ఎకరాల ఖరీదైన భూములు ప్రభుత్వ పరమయ్యాయి. అందులో కోర్టు కాంప్లెక్సుకు 15 ఎకరాలు ఇవ్వగా సుప్రీం కోర్టు సీజే ఈనెల 1న రూ. 115 కోట్లతో భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే స్పోర్స్ట్ సిటీ కోసం శాప్‌కు 30 ఎకరాలు ఇచ్చారు.మరో 21 ఎకరాలను పర్యాటక శాఖ ద్వారా దివ్యశ్రీ హోల్డింగ్స్ సంస్థకు ఇటీవలే ఇచ్చారు. అందులో ఫైవ్ స్టార్, ఫోర్ స్టార్ హోటళ్ళతో పాటు కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనున్నారు. మరో ఎకరా భూమిని రూ. 2.50 కోట్ల ధరతో ఆలిండియా వెలమ అసోసియేషన్‌కు కమ్యూనిటీ హాలు కోసం కేటాయించారు. దామినేడులో ప్రభుత్వ పరమైన 80 ఎకరాల భూమి విలువ రూ. వెయ్యి కోట్లు. ఈ భూములు వినియోగంలోకి రావడంతో తిరుపతి నగర విస్తరణకు అవకాశం ఏర్పడింది.