Share News

‘పరిషత్‌’ రిజర్వేషన్‌పై కసరత్తు

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:45 AM

స్థానిక ఎన్నికలపై గ్రామీణ ఓటర్లు, ఆశావహుల నిరీక్షణ రెండు రోజుల్లో కొలిక్కిరానుంది. మున్సిపల్‌ ఎన్నికల చైర్మన్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్ల గెజిట్‌ రావడంతో పట్టణాల్లో సీటు కోసం ఆశావహులు ఎవరి ప్రయత్రాల్లో వారున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలంటేనే ఆసక్తి కనపరిచే గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రజల్లో చర్చనడుస్తోంది.

 ‘పరిషత్‌’ రిజర్వేషన్‌పై కసరత్తు
రిజర్వేషన్‌ ప్రక్రియ నిర్వహణకు కలెక్టరేట్‌కు వచ్చిన అధికారులు

2021 నాటి రొటేషన్‌ పద్ధతిలోనే కేటాయింపు

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలపై గ్రామీణ ఓటర్లు, ఆశావహుల నిరీక్షణ రెండు రోజుల్లో కొలిక్కిరానుంది. మున్సిపల్‌ ఎన్నికల చైర్మన్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్ల గెజిట్‌ రావడంతో పట్టణాల్లో సీటు కోసం ఆశావహులు ఎవరి ప్రయత్రాల్లో వారున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలంటేనే ఆసక్తి కనపరిచే గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రజల్లో చర్చనడుస్తోంది.

పూర్తయిన కుల వర్గీకరణ

జిల్లాలోని 25 మండలాల్లో ఓటర్ల కులవర్గీకరణ పూర్తయిన విషయం తెలిసిందే. జిల్లాలో 9,09,604 మంది గ్రామీణ ఓటర్లుండగా, వీరిలో పురుషులు 4,46,693, మహిళలు 4,62,830, ఇతరులు 81 మంది ఉన్నారు. మండల పరిషత్‌, సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను సర్వే ద్వారా విభజించారు. వీటి ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు నిర్ణయించనున్నారు. మండల పరిషత్‌లు ఏర్పడి 40 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రస్తుతం 2021 ఎన్నికల రిజర్వేషన్‌ ప్రక్రియ ఆధారంగానే రొటేషన్‌ పద్ధతిలో కేటాయించనున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, ఎంపీపీ,జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్‌ కసరత్తు వేగం పుంజుకుంది.

ప్రత్యేకాధికారుల నియామకం

కలెక్టరేట్‌లో మంగళవారం నుంచి ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ పదవుల రిజర్వేషన్‌పై అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు సబ్‌కలెక్టర్‌ చల్లా కల్యాణి, డిప్యూటీ కలెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్టీవో విజయలక్ష్మి, ఎస్‌డీసీ మాధవకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆయా మండలాల ఎంపీడీవోలు ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయగా, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులకు ఐదుగురు ప్రత్యేకాఽధికారులు రిజర్వేషన్ల ప్రక్రియపై తలమునకలై వున్నారు. మంగళవారం రాత్రి ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకాధికారుల నివేదికను పరిశీలించాకే కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తుది రిజర్వేషన్‌ జాబితాపై సంతకాలు చేయనున్నారు.

రెండు రోజుల్లో తుది జాబితా

ఎంపీటీసీ,ఎంపీపీ,జడ్పీటీసీ స్థానాలకు బుధవారం ఉదయానికి కలెక్టరేట్‌లో ని ర్వహిస్తున్న రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. కలెక్టర్‌ పరిశీలించాక తుది రిజర్వేషన్‌ నిర్ణయిస్తారు. మొదట ఎస్టీ, తరువాత ఎస్సీ, ఆపైన బీసీ రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఎస్టీ, ఎస్సీ స్థానాలను ఆయా నియోజకవర్గాల్లోని జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయిస్తారు. బీసీ స్థానాలను ఆయా ప్రాంతాల్లోని బీసీ ఓటర్ల శాతం అనుసరించి కేటాయిస్తారు. రిజర్వేషన్ల ముసాయిదా సిద్ధమయ్యాక, రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ విధానంతో నిర్ణయించనున్నారు. అభ్యంతరాలుంటే స్వీకరించి తరువాతే కలెక్టర్‌ తుది రిజర్వేషన్‌ జాబితా విడుదల చేసే అవకాశముంది. దీనికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల వర్గాల భోగట్టా.

Updated Date - Oct 14 , 2026 | 01:45 AM