Share News

గ్రూప్‌-2లో పంచాయతీ కార్యదర్శికి ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఉద్యోగం

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:52 AM

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాల్లో మదనపల్లె మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బాలాజీ మెరిట్‌ కొట్టారు. ఏకంగా ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడు.

గ్రూప్‌-2లో పంచాయతీ కార్యదర్శికి ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఉద్యోగం
బాలాజి

మదనపల్లె టౌన్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాల్లో మదనపల్లె మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బాలాజీ మెరిట్‌ కొట్టారు. ఏకంగా ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడు. పెద్దమండ్యం మండలం రెక్కలకొండకు చెందిన చిన్నప్ప, కోటీశ్వరమ్మ దంపతుల కుమారుడు బాలాజీ టెన్త్‌ వరకు పెద్దమండ్యంలో, ఇంటర్‌ మదనపల్లెలో, బీఎస్సీ డిగ్రీ తిరుపతిలో చదివాడు. పంచాయతీ కార్యదర్శిగా(గ్రేడ్‌-5) 2019లో సచివాలయ ఉద్యోగిగా విధుల్లో చేరాడు. ఎలాగైనా పెద్ద ఉద్యోగం సాధించాలని 2024లో గ్రూప్‌-2 పరీక్ష రాశాడు. రెండేళ్లు అయినా గ్రూప్‌-2 ఫలితాలు విడుదలలో జాప్యంపై ఆంధ్రజ్యోతి కథనంతో ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో బాలాజీ మెరిట్‌తో ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడు.

డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికైన కుసుమకుమారి

పుంగనూరు రూరల్‌, జనవరి28(ఆంధ్రజ్యోతి): పుంగనూరుకు చెందిన టీచర్‌ ఎం.కుసుమకుమారి గ్రూప్‌ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. పుంగనూరు మండలం వడ్డువారిపల్లెకు చెందిన వై.సుబ్రహ్మణ్యం పాళ్యంపల్లె స్కూల్‌లో టీచరుగా, ఆమె భార్య ఎం.కుసుమకుమారి చౌడేపల్లె మండలం చారాల జడ్పీ హైస్కూల్‌లో సోషియల్‌ టీచరుగా పనిచేస్తున్నారు. కుసుమకుమారి 2008 డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయురాలుగా ఎంపికై రామసముద్రం మండలంలో పనిచేశారు. 2014 డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌గా ఎంపికయ్యారు. చారాలలో పనిచేస్తూ 2018లో గ్రూప్‌ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌లో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా ఎంపిక అయినా ఆమె వెళ్లలేదు. ఇటీవల మళ్లీ ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూపు 2 పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికైనట్లు తెలిపారు. కుటుంబీకులు, ఉపాధ్యాయులు, బంధువులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 29 , 2026 | 12:52 AM