Share News

ప్రకృతి వ్యవసాయం నిర్వహణ భేష్‌

ABN , Publish Date - Jul 08 , 2026 | 01:13 AM

విదేశీ విద్యార్థుల ప్రశంస

 ప్రకృతి వ్యవసాయం నిర్వహణ భేష్‌
ఎంకేపురంవాసులతో విదేశీయులు

శాంతిపురం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మన రైతుల ప్రకృతి వ్యవసాయ విధానాన్ని విదేశీ విద్యార్థులు పరిశీలించి ముచ్చట పడ్డారు. అమెరికాలోని ప్రెస్టిషియన్‌ యూనివర్శిటీ విద్యార్థుల బృందం మంగళవారం కుప్పం నియోజకవర్గంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించింది. ఈక్రమంలో విద్యార్థులు ఎంకేపురంలో శివారెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మాట్లాడారు. ప్రకృతి సాగు విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. పంటల నిర్వహణ, జీవామృతం, ఘనజీవామృతం, ఆవు అధారిత వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. రైతుల అనుభవాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానం ఆదర్శప్రాయంగా ఉందని, రైతులు అనుసరిస్తున్న పద్ధతులు, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన ద్వారా అనేక కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించిందన్నారు. ఏఎంసీ చైర్మన్‌ రాజు మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు ప్రకృతి వ్యవసాయానికి ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు. ఆయన దూరదృష్టితో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలనే అలోచనతోనే కుప్పానికి విమానాశ్రాయం తీసుకువచ్చారన్నారు. దీంతో రైతుల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం విదేశీ విద్యార్థులను సన్మానించారు. రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె, ఆనిగానూరుల్లో కూడా ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు చంద్రకళ, హరినాథరెడ్డి, శ్యామల, లేబర్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ భాష్యం విశ్వనాథనాయుడు, మాజీ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఆర్‌ నాగరాజు, సింగిల్‌ విండో చైర్మన్‌ గోపాల్‌, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మంజునాథ్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జీ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 01:15 AM